Begin typing your search above and press return to search.

సంపూను కూతురు అలా అడగ్గానే..

By:  Tupaki Desk   |   25 Sept 2017 3:50 PM IST
సంపూను కూతురు అలా అడగ్గానే..
X
బర్నింగ్ స్టార్ సంపూ వెండితెరపై ఎన్నో విన్యాసాలు చేశాడు. సూపర్ హీరోలాగా కనిపించాడు. కానీ బుల్లితెరలో మాత్రం అతనో పెద్ద ఫెయిల్యూర్ గా ముద్ర వేయించుకున్నాడు. ‘బిగ్ బాస్’ షోకు ప్రత్యేక ఆకర్షణ అవుతాడని.. అతణ్ని తొలి సీజన్ పార్టిసిపెంట్లలో ఒకరిగా ఎంపిక చేశారు నిర్వాహకులు. కానీ వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. సినిమాల్లో వీరత్వం చూపించిన అతను.. నిజ జీవితంలో బేలగా మారిపోయాడు. ‘బిగ్ బాస్’ హౌస్ లోపల ఉండలేక.. అనూహ్య పరిస్థితుల్లో బయటికి వచ్చేశాడు. రెండో వారమే అతను తనకు తానుగా ఎలిమినేట్ అయిపోవడం నిరాశ కలిగించింది. ఆ తర్వాత అతను వార్తల్లో లేడు.

ఐతే ‘బిగ్ బాస్’ ముగింపు సందర్భంగా తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టిన సంపూ ఉల్లాసంగా కనిపించాడు. ఎన్టీఆర్ తో చిట్ చాట్ సందర్భంగా సరదాగా మాట్లాడాడు. ‘బిగ్ బాస్’ రెండో సీజన్ కు అవకాశమిస్తే పాల్గొంటానని.. అప్పుడు హౌస్ లో చివరి వరకు ఉంటానని అతను చెప్పాడు. ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని సంపూను అడిగితే.. ‘‘ఇంటికెళ్లగానే నా కూతురు ఎదురొచ్చి.. మీరు నిజంగానే ఏడ్చారా.. లేక అది టాస్క్ లో భాగమా నాన్నా అని అడిగింది. ఆ మాట వినగానే నాకు చచ్చిపోవాలనిపించింది. ఐతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంటికి వెళ్లిన నాకు నా కుటుంబంతో పాటు ఊరివాళ్లందరూ అండగా నిలిచారు’’ అని సంపూ తెలిపాడు.