Begin typing your search above and press return to search.

సంపూను సీరియస్ గా తీసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   25 May 2016 9:01 AM GMT
సంపూను సీరియస్ గా తీసుకోవాల్సిందే
X
తనకు తాను ‘బర్నింగ్ స్టార్’ అని బిరుదిచ్చేసుకుని ఫేస్ బుక్ లో ఒకప్పుడు సంపూర్ణేష్ బాబు వేసిన వేషాలు చూసి జనాలు నవ్వుకున్నారు కానీ.. అతణ్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ రాజమౌళి సైతం పట్టించుకునేసరికి జనాలక్కూడా సంపూ మీద ఫోకస్ పెరిగింది. పిచ్చ కామెడీ సినిమా అయిన ‘హృదయ కాలేయం’ సీరియస్ గా హిట్టయిపోయి సంపూ బాబుకి టాలీవుడ్లో చోటిచ్చింది. ఐతే ‘సింగం 123’ దెబ్బకు మళ్లీ బాబు నేలమీదికి దిగిపోయాడు. కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ చేసినా అతణ్ని పెద్దగా పట్టించుకోలేదు. సంపూ హీరోగా ‘కొబ్బరిమట్ట’ పేరుతో ఇంకో సినిమా వస్తోందంటే కూడా లైట్ తీసుకున్నారు.

కానీ ‘కొబ్బరి మట్ట’ టీజర్ రిలీజయ్యాక సీన్ మారిపోయింది. టీజర్లో నిమిషానికి పైగా నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి టాలీవుడ్ కు దిమ్మదిరిగే షాకిచ్చాడు సంపూ. కేవలం ఒక్క రోజులోనే ఈ టీజర్ ను 3 లక్షల మంది చూడటం అంటే చిన్న విషయం కాదు. ‘కొబ్బరి మట్ట’ టీమ్ ప్రచారం చేసుకుంటున్నట్లు చిన్న సినిమాల్లో ఇది నభూతో అనదగ్గ రికార్డే.

ఈ దెబ్బకు అందరూ సంపూని సీరియస్ గానే పట్టించుకుంటున్నారు. ‘కొబ్బరి మట్ట’ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ ఊపు చూస్తే ఈ సినిమా మంచి క్రేజ్ మధ్య రిలీజయ్యేలా కనిపిస్తోంది. మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. మొన్నటిదాకా సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించని బయ్యర్లు కూడా ఇప్పుడు ‘కొబ్బరిమట్ట’ బిజినెస్ గురించి ఆరాలు తీస్తున్నారట. మొత్తానికి ‘హృదయకాలేయం’ తర్వాత మరోసారి సంపూ సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే కనిపిస్తున్నాడు.