Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులోకి 'సామాన్యుడు'..!

By:  Tupaki Desk   |   4 Jan 2022 11:30 AM GMT
సంక్రాంతి రేసులోకి సామాన్యుడు..!
X
సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం కరోనా నేపథ్యంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో ఖాళీ ఏర్పడటంతో.. అనేక చిన్న సినిమాలు, ప్రాంతీయ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నట్టు పది సినిమాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ క్రమంలో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాయి.

యాక్షన్ సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ''సామాన్యుడు". 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. టాలెంటెడ్ డైరెక్టర్ తూ.పా. శరవణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

'సామాన్యుడు' చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా 2022 జనవరి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకముందు ప్రకటించారు. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగా సంక్రాతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. జనవరి 14న తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే ‘సామాన్యుడు’ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్ ఆసక్తిని కలిగించాయి. డబ్బు పదవి అధికారం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తిలపై అసామాన్యుడుగా మారిన ఓ సామాన్యుడు చేసిన పోరాటమే ఈ సినిమా అని ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఇందులో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా.. యోగిబాబు కీలక పాత్ర పోషించారు.

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శకర్ రాజా సంగీతం సమకూర్చారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని.. తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

కాగా, కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయడం.. 50 శాతం సామర్థ్యంతో సినిమా ప్రదర్శన వంటి ఆంక్షలతో RRR చిత్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో అప్పటికే డేట్ ని ఫిక్స్ చేసుకున్న 'రాధే శ్యామ్' తోపాటుగా 'బంగార్రాజు' బరిలోకి వచ్చింది. అలానే 'అతిథి దేవోభవ' '1945' 'వేయి శుభములు' 'డిజె టిల్లు' 'సూపర్‌ మచ్చి' 'హీరో' 'రౌడీ బాయ్స్' '7 డేస్ 6 నైట్స్' వంటి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటితో పాటుగా 'బలం' అనే డబ్బింగ్ సినిమా రాబోతోంది. ఇప్పుడు 'సామాన్యుడు' కూడా సంక్రాంతికి సందడి చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ డజను చిత్రాల్లో ఏవేవి ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయో చూడాలి.