Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్‌...!

By:  Tupaki Desk   |   1 Sep 2020 5:30 PM GMT
ఏపీ డీజీపీ తో సమంత వీడియో కాన్ఫరెన్స్‌...!
X
సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని బాలికలు మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ మరియు సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన కార్యక్రమం ''ఈ- రక్షాబంధన్‌''. తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ-రక్షాబంధన్‌ లో భాగంగా యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌ కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్లైన్ లో శిక్షణ ఇచ్చారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్‌, యానిమేషన్స్‌, రీడింగ్ మెటీరియల్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఆగస్టు నెల మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ శాఖ మరియు సీఐడీ నిర్వహించిన ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థినులతో పాటు హీరోయిన్ అక్కినేని సమంత తదితరులతో ఏపీ డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఐడీ అధికారులు నెల రోజులపాటు శ్రమించి పది లక్షల మందికి పైగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారని.. కరోనా వల్ల ఆన్లైన్ తరగతుల నేపథ్యంలో పిల్లలు ఫోన్లు ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి వచ్చిందని.. దీంతో చిన్నారులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్‌ ద్వారా 2.29 లక్షల మంది అనుభవాలు సూచనలు తీసుకున్నామని.. ఈ ఏడాది మహిళలపై ఎక్కువగా పెళ్లి పేరుతో మోసం చేసిన నేరాలే ఉన్నాయన్నాయని.. అన్యాయం జరిగిందని మహిళలు పోలీసు స్టేషన్‌ కు వస్తే కచ్చితంగా ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు అవుతుందని డీజీపీ తెలిపారు. సమంత అక్కినేని మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్ లైన్ బెదిరింపు సైబర్‌ బుల్లీయింగ్‌ బాగా ఎక్కువైందని .. మహిళలు పిల్లలను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించడం అభినందనీయమని.. ఈ-రక్షా బంధన్‌ కార్యక్రమం మహిళలకు ఒక బ్రదర్ లా పనిచేసిందని చెప్పుకొచ్చింది.