Begin typing your search above and press return to search.

సమంత సినిమాకు బ్రేక్‌ పడలేదు

By:  Tupaki Desk   |   14 April 2021 4:30 AM GMT
సమంత సినిమాకు బ్రేక్‌ పడలేదు
X
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో దిల్‌ రాజుతో కలిసి నిర్మిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. దర్శకుడు గుణశేఖర్‌ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు అంటూ ఆయన కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయ్యారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఆయన శాకుంతలం సినిమాను కాస్త ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని దర్శకుడు గుణశేఖర్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో స్పందించాడు. తనకు కరోనా లేదు అంటూ స్పష్టంగా చెప్పడంతో శాకుంతలం సినిమా ఆగిపోలేదు అంటున్నారు.

గుణశేఖర్‌ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత శాకుంతలం సినిమా చేస్తున్నాడు. ఆయన గత చిత్రం రుద్రమదేవి పర్వాలేదు అనిపించినా కూడా కొన్ని కారణాల వల్ల తదుపరి సినిమా విషయంలో ఆలస్యం జరిగింది. శాకుంతలం సినిమా విషయంలో ఆలస్యం చేయకూడదని ముందస్తుగానే నిర్ణయం తీసుకున్న గుణశేఖర్‌ అందుకు తగ్గట్లుగా ప్లాన్‌ ను వేశాడు. నిర్మాత దిల్‌ రాజు మరియు సమంతలకు గుణశేఖర్‌ ఖచ్చితమైన హామీ ఇచ్చాడని ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తి చేస్తానంటూ చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

శాకుంతలం సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిని పాన్‌ ఇండియా సినిమా గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పకుండా గుణశేఖర్‌ ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. శాకుంతలం సినిమాలో సమంత లుక్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సమంత లుక్‌ ను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ నిలిచి పోతుందని భావించగా గుణశేఖర్‌ కు నెగటివ్‌ రావడంతో వెంటనే షూటింగ్‌ మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు ఉన్నాయి.