Begin typing your search above and press return to search.

'ఆటోడ్రైవర్'కు స్టార్ హీరోయిన్ కారు గిఫ్ట్..!

By:  Tupaki Desk   |   17 April 2021 8:30 AM GMT
ఆటోడ్రైవర్కు స్టార్ హీరోయిన్ కారు గిఫ్ట్..!
X
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా తమలోని సేవాగుణాన్ని బయట పెడుతుంటారు. అది పేదవాళ్లకు కావచ్చు లేదా ఏదైనా ఆశ్రమానికి విరాళం అందించవచ్చు. ఇవేవి కాదనుకుంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళం రూపంలో సహాయం చేస్తారు. ఇలాగే విద్య విషయంలో ఫ్రీ ఎడ్యుకేషన్ లాంటివి కూడా చేస్తుంటారు సినీసెలబ్రిటీలు. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం తాజాగా ఓ నిరుపేద లేడీ ఆటోడ్రైవర్ కు భారీ బహుమతి అందించింది. అదికూడా ఎవరు ఊహించనిది.. అందరికి ఆశ్చర్యం కలిగించేది కావడం విశేషం. అవును నిజంగానే సమంత తనది పెద్ద మనసు అని మరోసారి నిరూపించుకుంది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని డోవుర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ కవితకు సమంత పన్నెండున్నర లక్షలు ఖరీదు చేసే స్విఫ్ట్ డిసైర్ కారును బహుమతిగా అందించింది.

ఆరు నెలలుగా ఆటోడ్రైవర్ కవిత లైఫ్ స్టోరీ తెలుసుకొని.. ఆమె కష్టానికి మెచ్చి సమంత ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి భర్త వేధింపులతో.. తల్లిదండ్రులు లేక కవిత బడుగు జీవనం గురించి ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా వీడియోస్ చేశారట. ఆ వీడియో చూసాకే సమంత తనకు ఇంతటి మరిచిపోలేని సహాయం చేసిందని కవిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డ్రైవర్ కవిత సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఇంతకాలం పొలం పనులు చేస్తూ ఏడుగురు చెల్లెళ్లను పోషించిన కవిత.. ఆటోడ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్ బాచుపల్లి ఏరియాలో ఆటో నడుపుతూ జీవనం సాగించడం చూసి సమంత మనసు కరిగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలే బంజారాహిల్స్ మారుతీ షోరూమ్ నుండి కవిత కారును అందుకుంది. ఇక ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ ప్రముఖులు, నేటిజన్లు సమంత సేవాదృక్పథాన్ని కొనియాడుతున్నారు.