Begin typing your search above and press return to search.

నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది: సమంత

By:  Tupaki Desk   |   2 Oct 2021 6:00 PM IST
నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది: సమంత
X
సమంత - చైతూ మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై సమంతగానీ .. చైతూ గాని .. నాగార్జునగాని స్పందించకపోవడం అందరిలో అనుమానాన్ని రేకెత్తించింది. నిప్పులేనిదే పొగరాదుకదా అనుకున్నారు .. ఆ తరువాత కొన్ని రోజులకే నిప్పు ఉందనే విషయాన్ని గ్రహించారు. 'లవ్ స్టోరీ' సినిమాకి సంబంధించిన ఏ ఫంక్షన్ కి సమంత హాజరుకాకపోవడంతోనే అందరిలో ఒక స్పష్టత వచ్చేసింది. ఇక ఈ ఇద్దరూ విడిపోవడం ఖాయమనే అనుకున్నారు.

వివాహమైన తరువాత సమంత సోషల్ మీడియాలో తన దూకుడు తగ్గించకపోవడం చైతూ ఫ్యామిలీకి ఇబ్బందిని కలిగిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో గౌరవం ఉంది. సమంత పెరిగిన ప్రదేశం .. వాతావరణం వేరు కావడం వలన ఆమెకి ఈ విషయం అర్థం కావడం లేదని అనుకున్నారు. ఈ విషయంలో నాగార్జున .. చైతూ చెప్పిచూసినా ఆమె వినిపించుకోవడం లేదనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. ఇక చైతూ విషయానికి వస్తే అతను నిదానస్తుడు అనే విషయం చూడగానే అర్థమైపోతుంది. ఎవరి మనసుకు కష్టం కలిగించే తత్వం కాదనే విషయం స్పష్టమైపోతుంది.

నిజానికి తెలుగు ఇండస్ట్రీలోనే నాగ చైతన్య అంతటి అదృష్టవంతుడు లేడని చెప్పాలి. ఒక తాత స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగు వెలిగిన రామానాయుడు అయితే .. మరో తాత అక్కినేని నాగేశ్వరరావు. ఈ ఇద్దరి పేర్లు ప్రస్తావించకుండా తెలుగు సినిమాను గురించి చెప్పుకోలేం. అటు దగ్గుబాటి ఫ్యామిలీకి .. ఇటు అక్కినేని ఫ్యామిలీకి మధ్య వారధిగా చైతూ కనిపిస్తాడు. అలాంటి ఒక కుటుంబానికి సమంత కోడలు కావడం నిజంగానే ఆమె చేసుకున్న అదృష్టం అని అంతా అనుకున్నారు. వాళ్ల విడాకుల వార్తలు నిజం కాకూడదనే భావించారు. కానీ దురదృష్టం కొద్దీ తాము విడిపోయినట్టుగా కొంత సేపటి క్రితం సమంత - చైతూ ఒక పోస్ట్ పెట్టారు.

తాము భార్యాభర్తలుగా విడిపోయి సొంత మార్గాలలో ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నామని చెప్పారు. పదేళ్లకి పైగా తమ ఫ్రెండ్షిప్ కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నామనీ, అదే ఫ్రెండ్షిప్ ఇకపై కూడా కొనసాగుతుందని నమ్ముతున్నామని అన్నారు. అభిమానులు .. మీడియావారు తమ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కోరారు. నిజంగా ఇది అభిమానులకు ఒక చేదు వార్తనే. అయితే ఈ నేపథ్యంలో సమంత "నీకున్న అన్ని హోప్స్ పోయినప్పుడు నిజమైన ప్రేమ గెలిచిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయనే సత్యాన్ని గుర్తుచేసుకో అని మా అమ్మ చెప్పింది" అంటూ ఇన్ స్టా స్టోరీలో పెట్టడం విశేషం.