Begin typing your search above and press return to search.

సమంత.. తన ఆత్మకు సెలవిచ్చేసిందా?

By:  Tupaki Desk   |   8 Jun 2018 9:58 AM GMT
సమంత.. తన ఆత్మకు సెలవిచ్చేసిందా?
X
ఒకప్పుడు పరభాషా కథానాయికలు తెలుగులో నటిస్తే మన భాష ఒక్క ముక్క కూడా చేర్చుకునే ప్రయత్నం చేసేవాళ్లు కాదు. డబ్బింగ్ చెప్పడం సంగతి తర్వాత.. ఏదైనా వేడుకకు వచ్చినపుడు సరిగ్గా నమస్కారం అని చెప్పడం కూడా వచ్చేది కాదు. ఆ మాటను కూడా విచిత్రంగా పలుకుతూ వయ్యారాలు పోయేవాళ్లు. ఉత్తరాది భామలే కాదు.. చెన్నై నుంచి వచ్చిన త్రిష లాంటి వాళ్లు కూడా ఒక్క ముక్క తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేసేవాళ్లు కాదు. కానీ ఈ తరం కథానాయికలు అలా కాదు. ఇక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టి సంవత్సరం తిరిగితే చక్కగా తెలుగు మాట్లాడేస్తున్నారు. వేదికలెక్కినపుడు తెలుగు దంచేస్తున్నారు. సొంతంగా తమ పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. సమంత సైతం ఇటీవలే ‘మహానటి’తో ఈ జాబితాలో చేరింది. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

ఐతే సమంత డబ్బింగ్ ఆ ఒక్క సినిమా వరకే పరిమితం కావడం లేదు. మున్ముందు కూడా సొంత డబ్బింగే ట్రై చేయాలని ఆమె అనుకుంటోంది. తమిళంలో ఆమె నటించిన కొత్త సినిమా ‘సూపర్ డీలక్స్’లోనూ సొంత వాయిసే వినిపించబోతోంది. ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతూ.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సామ్. డబ్బింగ్ నువ్వు చెబుతున్నావా.. ఇంకెవరైనానా అని సమంతను అడిగితే.. తనే చెప్పుకుంటున్నానని కూడా బదులిచ్చింది సామ్. సమంతకు మొదట్నుంచి డబ్బింగ్ చెబుతూ.. ఆమె ‘ఆత్మ’గా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. ఈ ట్వీట్ మీద విచిత్రంగా స్పందించింది. ఫన్నీ హావభావాలతో కొన్ని ఇమోజీలు పెట్టింది. సమంత వరుసగా ఇలా డబ్బింగ్ చెప్పుకుంటుండటంతో ఇక చిన్మయికి ఆమెకు డబ్బింగ్ బంధం తెగిపోతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.