Begin typing your search above and press return to search.

'ఊ అంటావా మావా' ఎఫెక్ట్: సమంత - చంద్రబోస్ లకు పాలాభిషేకం..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 10:30 AM GMT
ఊ అంటావా మావా ఎఫెక్ట్: సమంత - చంద్రబోస్ లకు పాలాభిషేకం..!
X
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ''పుష్ప: ది రైజ్'' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సాగిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. 45 మిలియన్లకు పైగా వ్యూస్ తో 1 మిలియన్ ప్లస్ లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన 'ఊ అంటావా ఊఊ అంటావా' పాటను సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ ఈ పాట రాశారు. మగవారి ఆధిక్యతను ప్రశ్నించేలా ఉన్న ఈ స్పెషల్ సాంగ్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇది మగాళ్లను కించపరిచేలా.. వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ ఐటమ్ సాంగ్ కు మద్దతుగా ఓ మహిళా మండలి రంగంలోకి దిగిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పాటలో నర్తించిన సమంత కు లిరిసిస్ట్ చంద్రబోస్ ఫొటోలకు పాలాభిషేకం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

'పుష్ప' స్పెషల్ సాంగ్ లో ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకున్నా మగవారు వంకర బుద్ధితో చూస్తారని.. పెద్ద మనుషుల్లాగా మంచి మనసు ఉన్న వ్యక్తుల్లా నీతులు చెబుతారని.. మగ జాతి అంతా ఒకటే అనే అర్థం వచ్చే సాహిత్యం ఉంది. చంద్రబోస్ రాసిన ఈ పాట కేవలం సినిమాలో ఐటమ్ సాంగ్ మాదిరిగా మాత్రమే కాకుండా చాలా అంశాలను ప్రస్తావిస్తూ రాసినట్లు అనిపిస్తుంది.

ఈ పాటపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఇందులో ఆడిపాడింది ఫెమినిస్ట్ గా ముద్రపడిన సమంత కాబట్టి వివాదంగా మారింది. సామ్ గతంలో ఆడవారిని కించ పరుస్తున్నారంటూ '1 నేనొక్కడినే' పోస్టర్ ను విమర్శించింది. కానీ ఇప్పుడు తనే మగవారిని తక్కువ చేసే సాంగ్ లో పెరఫార్మన్స్ చేసిందనేది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు సమంత ఇటీవల భర్త నుంచి విడిపోవడంతో తన పర్సనల్ లైఫ్ కు అన్వహిస్తూ పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఇదే క్రమంలో మగబుద్ధే వంకరబుద్ది అంటూ పురుష సమాజాన్ని కించ పరుస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిందని వార్తలు వచ్చాయి. సమంత తో పాటుగా లిరిసిస్ట్ - సింగర్ పై కేసు పెట్టారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు 'పుష్ప' ఐటెమ్ సాంగ్ కు సపోర్ట్ గా మహిళా సంఘం ముందుకు వచ్చిందని తెలుస్తోంది.

ఆంద్రప్రదేశ్ అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాటలో డాన్స్ చేసిన సమంత మరియు గేయ రచయిత చంద్రబోస్ కి స్థానిక మహిళా మండలి సభ్యులు అర్చన చేయించారు. అంతేకాదు వారి ఫొటోలకు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 'పుష్' చిత్రాన్ని మొదటి రోజు చూస్తామని.. ఐటమ్ సాంగ్ కు విజిల్స్ కూడా వేస్తామని ముక్తకంఠంతో మహిళల ఐకమత్యం వర్ధిల్లాలని నినాదాలు చేయడం కొసమెరుపు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రెండు భాగాలుగా ''పుష్ప'' సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.