Begin typing your search above and press return to search.

సమంత కొత్త ఛాన్సుల పరిస్థితి ఏమిటి?

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:30 AM GMT
సమంత కొత్త ఛాన్సుల పరిస్థితి ఏమిటి?
X
సమంత .. ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చింది. ఎవరి సపోర్టు లేకుండా అడుగులు ముందుకు వేసింది. కేవలం తన సొంత నిర్ణయాలపైనే ఆధారపడుతూ కెరియర్ పరంగా చాలా దూరం ప్రయాణించింది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పటికీ ఆమె అదే హోదాలో కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లు సమంత తమ రోల్ మోడల్ అని చెప్పుకునే స్థాయికి చేరుకోగలిగింది. టాలెంట్ ఉంటే .. దూసుకుపోగల సత్తా ఉంటే అవకాశాలు సొంతమవుతాయనే విషయాన్ని నిరూపించింది.

వివాహమైన తరువాత సమంత నటన ప్రధానమైన పాత్రలను .. నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. అందుకు ఉదాహరణగానే 'యు టర్న్' .. 'ఓ బేబీ' .. 'జాను' కనిపిస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా సమంత అభినయానికి అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి. 'శాకుంతలం' వంటి ఒక అద్భుతమైన కథాకావ్యంలో నాయికగా గుణశేఖర్ ఆమెను ఎంపిక చేయడానికి గల కారణం, ఆమె నటనపై గల నమ్మకమే అనుకోవాలి. ఈ పాత్రలో ఆమె చేసే హావభావ విన్యాసం వచ్చే ఏడాదిలో ఆవిష్కృతమవుతుంది. ఆమె అభిమానులంతా ఈ సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

'శాకుంతలం' సినిమా సమంత కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా తక్కువమందికి మాత్రమే దక్కిన అరుదైన అవకాశం ఆమెకి లభించింది. అలాంటి ఈ సినిమా తరువాత ఆమె ఎవరితో ఏ ప్రాజెక్టులు చేయనుందనే విషయం కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. అన్నీ తెలుగు సినిమాలేనా? లేదంటే తెలుగుతో పాటు తమిళ .. హిందీ కూడా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులు మొదలుకావలసి ఉంది.

అయితే స్టార్ హీరోలతో వరుస సినిమాలు పట్టాలెక్కుతున్న ఈ సమయంలో, సమంత వంటి హీరోయిన్ డేట్స్ ఇస్తే అంతకుమించిన అదృష్టం లేదనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో బాధలను మరిచిపోవడం కోసమైనా సమంత వరుస సినిమాలు చేయాలనుకుంటుంది. ఆమెకి గల క్రేజ్ .. డిమాండ్ ను బట్టి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ వెనకడుగు వేయరు. కానీ సమంత విడాకులు తీసుకుకోగానే ముందుగా అవకాశం ఇచ్చేది తామే అయితే, వేరే సంకేతాలు వెళతాయనే ఆలోచనను కొంతమంది చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆమెను ప్రోత్సహించడానికి తాము ఉత్సహాన్ని చూపిస్తున్నట్టు అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

సమంత - చైతూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలోనే విడిపోయారు. ఇక సమంత తన సినిమాలు తను చేసుకోవడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఆమెకి అవకాశాలు ఇవ్వడం వలన ఇండస్ట్రీలో అతిపెద్ద కుటుంబాలతో తమకి గల సాన్నిహిత్యం దెబ్బ తింటుందేమోనని కొంతమంది ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అందువలన ఆమెను సంప్రదించడం వలన లేనిపోని చీకాకులు కొని తెచ్చుకున్నట్టు అవుతుందేమోనని భావిస్తున్నారట. ఒకవేళ అంతగా అయితే పరిస్థితులు కాస్త చల్లబడిన తరువాత చూద్దాంలే అనుకుంటున్నారట. మరి ఇలాంటి సమయంలో సమంత ఇక్కడే ఉంటూ కెరియర్ నెట్టుకొస్తుందా? చెన్నై వెళ్లి తిరిగి అక్కడ తన పోరాటాన్ని కొనసాగిస్తుందా? అనేది చూడాలి.