Begin typing your search above and press return to search.

అడవిలోని 'పుష్ప' బ్యాచ్ కి ఆవిరి పుట్టించే సమంత ఐటమ్!

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:00 PM IST
అడవిలోని పుష్ప బ్యాచ్ కి ఆవిరి పుట్టించే సమంత ఐటమ్!
X
సుకుమార్ ఒక్కో సినిమాను ఒక్కో జోనర్లో చేసుకుంటూ వెళుతుంటాడు. కథలు మాత్రమే కాదు వాటి నేపథ్యాలు కూడా ఎక్కడ ఎంత మాత్రం కలవకుండా చూస్తుంటాడు. ఇక కథాకథనాల విషయంలోనే కాదు సంగీతం పరంగా కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు తన సినిమాకు రావాలనే ఉద్దేశంతో, ఆయన తన కథల్లో అన్ని రకాల అంశాలను అందంగా సర్దేస్తూ ఉంటాడు. మాస్ ఆడియన్స్ కి అసంతృప్తి కలగకూడదనే ఉద్దేశంతో, ఆయన తన సినిమాల్లో తప్పకుండా ఒక ఐటమ్ సాంగ్ పెటేస్తూ ఉంటాడు.

సాధ్యమైనంత వరకూ సుకుమార్ సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉంటాడు. వాళ్లిద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. అందువలన వాళ్ల సినిమాల్లోని పాటలు కూడా చాలావరకూ హిట్టే. ముఖ్యంగా సుకుమార్ - దేవిశ్రీ అనగానే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుందనే నమ్మకం మాత్రం ఆడియన్స్ లో ఏర్పడిపోయింది. అందుకు కారణం వాళ్ల కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన 'అ అంటే అమలాపురం' .. 'రింగ రింగా' .. 'డియ్యాలో డియ్యాలో' .. 'జిల్ జిల్ జిగేలు రాణి' పాటలు కొత్త రికార్డులను సెట్ చేయడమే.

అలా తాజా చిత్రమైన 'పుష్ప'లోని ఐటమ్ కోసం కూడా దేవిశ్రీ ప్రసాద్ ఒక అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ భామల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ లోగా సమంత అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నారు. కొన్ని రోజులుగా ఈ పాట చిత్రీకరణ కొనసాగుతోంది. రీసెంట్ గా ఆ పాటకి సంబంధించిన సమంత ఫొటో ఒకటి వదిలారు కూడా. 'ఊ అంటావా .. ఊ అంటావా' అంటూ ఈ స్పెషల్ సాంగ్ సాగుతుందట.

ఇంతకుముందు సుకుమార్ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఏ స్పెషల్ సాంగ్ కి తగ్గకుండా ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. కొంతకాలంగా గ్లామరస్ పాత్రలకి దూరంగా ఉంటూ వచ్చిన సమంతా ఒక్కసారిగా ఐటమ్ సాంగ్ చేస్తుండటంతో, అభిమానుల్లో అంతకంతకూ ఆసక్తి పెరుగుతూ పోతోంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు. ఈ నెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 17వ తేదీన సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి మరి.