Begin typing your search above and press return to search.

నెగెటివ్ రోల్ లో సమ్మూ దుమ్మురేపేస్తుందట!

By:  Tupaki Desk   |   7 Jan 2022 9:30 AM GMT
నెగెటివ్ రోల్ లో సమ్మూ దుమ్మురేపేస్తుందట!
X
సమంత మంచి ఆర్టిస్ట్ అని ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఆమెలో టాలెంట్ లేకపోతే ఇక్కడి వరకూ వచ్చే అవకాశం లేదు .. ఇంతకాలం నిలబడే అవకాశం లేదు. మొదట్లో తెరపై కాస్త అమాయకంగా కనిపిస్తూ .. గ్లామర్ ను మాత్రమే నమ్ముకుని వచ్చినట్టుగా అనిపించిన సమంత, ఆ తరువాత నిదానంగా తన సత్తా చాటడం మొదలుపెట్టింది. సమంతలో ఒక గ్లామరస్ హీరోయిన్ మాత్రమే కాదు .. ఒక మంచి నటి కూడా ఉందనే విషయం అటు ప్రేక్షకులకు .. ఇటు ఇండస్ట్రీకి అర్థమైంది. దాంతో ఆమె తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంటర్ కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

ఏక కాలంలో రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కొంతమంది హీరోయిన్స్ లో సమంత చేరిపోయింది. ఈ రెండు భాషల్లోను ఆమె అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. వివాహమైన తరువాత గ్లామరస్ పాత్రలను దూరం పెట్టిన సమంత, నటనకు స్కోప్ ఎక్కువగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఆమె ఆలోచనా విధానం మారినట్టుగా కనిపిస్తుంది. వెబ్ సిరీస్ లలోను .. సినిమాలలోను గ్లామర్ డోస్ పెంచడానికి ఆమె వెనుకడుగు వేయడం లేదు. అదే సమయంలో కొత్తదనంతో కూడుకున్న పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపుతోంది.

విడాకుల తరువాత సమంత ఐటమ్ సాంగ్ తో తెరపైకి రావడం కొంతమంది మనసుకి కష్టం కలిగించినా, ఆ పాట ఆ సినిమాను మాస్ ఆడియన్స్ లోకి మరింతగా తీసుకెళ్లింది. ఇక తమిళంలో సమంత 'కాతువాకుల రెండు కాధల్' సినిమా చేసింది. ఇది నయనతార సొంత సినిమా .. దర్శకుడు విఘ్నేశ్ శివన్. నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, అందుకు సమాంతరమైన పాత్రలో సమంత కనిపించనుంది. అయితే ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనుంది. ఇంతవరకూ ఈ తరహా పాత్రను చేయని సమంత, ఈ పాత్రలో దుమ్మురేపేయనుందని అంటున్నారు.

నయనతార ప్రధానమైన పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథ అనూహ్యమైన .. ఆసక్తికరమైన మలుపులు తిరగడానికి సమంత కారకురాలవుతుందని అంటున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇకపై ఈ తరహా పాత్రలకి ముందుగా ఆమె పేరే పరిశీలనలోకి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో సమంత చేసిన 'శాకుంతలం' పాన్ ఇండియా స్థాయి రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటోంది. థ్రిల్లర్ జోనర్లో నిర్మితమవుతున్న 'యశోద'లో కూడా ఆమె చాలా డిఫరెంట్ రోల్ చేస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ప్రేక్షకులు కొత్త సమంతను చూడబోతున్నారన్న మాట.