Begin typing your search above and press return to search.

పరువునష్టం దావా కేసు: సమంత కు అనుకూలంగా కోర్టు తీర్పు..!

By:  Tupaki Desk   |   26 Oct 2021 1:11 PM GMT
పరువునష్టం దావా కేసు: సమంత కు అనుకూలంగా కోర్టు తీర్పు..!
X
తన పరువుకు భంగం కలిగించారంటూ మూడు యూట్యూబ్‌ చానళ్లపై సినీ నటి సమంత కూకట్‌ పల్లి కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సమంత కు అనుకూలంగా తీర్పు వచ్చింది. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని సమంత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానల్స్ వెంటనే ఆమెకు సంబంధించిన కంటెంట్ ని తొలగించాలని ఇంజక్షన్‌ ఆర్డర్స్‌ పాస్ చేసింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అంతేకాదు సోష‌ల్ మీడియాలో స‌మంత త‌న‌ వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను పోస్ట్ చేయ‌వ‌ద్దని కోర్టు కోరింది.

సమంత వేసిన పరువు నష్టం దావా పిటీషన్‌ పై సోమవారం వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. తన క్లయింట్ పరువుకు భంగం కలిగేలా ప్రచారమైన తప్పుడు కథనాలను యూట్యూబ్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు.. తీర్పును ఈరోజు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో స‌మంత‌కు ఊర‌ట కలిగించేలా తీర్పు వెలువడింది.

కాగా, సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అధికారికంగా ప్రకటించకముందే సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇక విడాకుల ప్రకటన తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. విడాకులకు కారణమిదే అంటూ హద్దులు దాటి విశ్లేషణలు చేశారు. సమంత కు వేరే వ్యక్తితో సంబంధం ఉందని.. అబార్షన్ చేయించుకుందని వ్యక్తిగత విషయాల మీద వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా కేసు వేసింది. 21న విచార‌ణ చేప‌ట్టిన కూక‌ట్‌ ప‌ల్లి కోర్టు..  అక్టోబ‌ర్ 22 మరియు 25వ తేదీలలో వాదనలు విన్నది. ఈ క్రమంలో నేడు (అక్టోబ‌ర్ 26) సామ్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది.