Begin typing your search above and press return to search.

ఆ పాత్ర గురించి సమంత తెగ చెబుతోంది

By:  Tupaki Desk   |   25 Feb 2019 6:32 AM GMT
ఆ పాత్ర గురించి సమంత తెగ చెబుతోంది
X
ఏ హీరో అయినా హీరోయిన్‌ అయినా ఎక్కువ శాతం సినిమా ప్రమోషన్‌ సమయంలో నేను ఈ చిత్రంలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రంలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు, ప్రత్యేకంగా ఉండి అభిమానులను అలరించి నాకు మరింత మంచి పేరు తెచ్చి పెడుతుందని చెబుతూ ఉంటారు. తాజాగా సమంత కూడా అదే చెబుతోంది. అయితే ఈమె మాటలు రెగ్యులర్‌ గా చెప్పే మాటల కంటే కాస్త ఎక్కువగా అనిపిస్తున్నాయి.

తెలుగులో ఒక వైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రలు పోషిస్తూ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న సమంత మరో వైపు తమిళంలో కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ వస్తోంది. తాజాగా ఈమె 'సూపర్‌ డీలక్స్‌' అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై తమిళ సినీ వర్గాల్లో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ లో కనిపించడంతో పాటు, రమ్యకృష్ణ ఒక సెమీ పోర్న్‌ స్టార్‌ గా కనిపించబోతుంది. ఇంకా ఈ చిత్రంకు సంబంధించిన పలు విషయాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఈ సమయంలోనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత 'సూపర్‌ డీలక్స్‌'లో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రం కథ చాలా విభిన్నంగా ఉంటుంది. విభిన్నమైన కథలో తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుంది. దాంతో ఆ పాత్రను చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రిహార్సల్స్‌ చేసి మరీ నటించాను. దర్శకుడు నా పాత్రను చాలా బాగా తీర్చి దిద్దాడు. నాకు ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. నాకే కాకుండా నా అభిమానులకు కూడా ఇది విభిన్నమైన అనుభూతిని ఇస్తుందని సమంత సంబరంగా చెబుతోంది. సమంత చెబుతున్న విషయాలతో తెలుగు వారిలో కూడా సూపర్‌ డీలక్స్‌ సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరుగుతూ వస్తోంది.