Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో అక్కినేని కోడ‌లు

By:  Tupaki Desk   |   28 July 2021 4:49 AM GMT
ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో అక్కినేని కోడ‌లు
X
డార్లింగ్ ప్ర‌భాస్ ని పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ప్ర‌మోట్ చేస్తాన‌ని మ‌హాన‌టి దర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రామిస్ చేశారు. అది ప్ర‌భాస్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ‌ను పెంచింది. అందుకు త‌గ్గ‌ట్టే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ దాదాపు 500కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెలుగు-త‌మిళం-హిందీ స‌హా బ‌హుభాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ప్ర‌భాస్ కి మార్కెట్ ఉన్న జ‌పాన్ - తైవాన్- కొరియా లాంటి చోట్లా ఈ సినిమా అత్యంత భారీగా రిలీజ్ కానుంది.

ఈ చిత్రానికి `ప్రాజెక్ట్ కె` అనే వ‌ర్కింగ్ టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ తారాగ‌ణాన్ని నాగ్ అశ్విన్ ఎంపిక చేసుకున్నారు. బిగ్ బి అమితాబ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా ఇందులో క‌థానాయిక‌ దీపికా పదుకొనే న‌టిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో సమంత అక్కినేని.. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని తెలిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో మొదటి షూటింగ్ షెడ్యూల్ లో  అమితాబ్ స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై ముఖ్య‌మైన సన్నివేశాలను తెర‌కెక్కిస్తున్నారు.

భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ ..

ఇక ఈ సినిమా ఆద్యంతం గ్రీన్ మ్యాట్ .. బ్లూమ్యాట్ త‌ర‌హా ఫార్మాట్ల‌లో మెజారిటీ భాగం తెర‌కెక్క‌నుంది. ఇందుకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ల‌ను నిర్మించారు. అలాగే ఈ మూవీ విజువ‌ల్ గ్రాఫిక్స్ కోస‌మే ఏకంగా 200కోట్ల బ‌డ్జెట్ ని వెచ్చించ‌నున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

దీపిక - స‌మంత‌ల‌తో ప్ర‌భాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో అరుదైన కాంబినేష‌న్స్ తో అసాధార‌ణ ప్ర‌య‌త్న‌మిది. డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ ప‌ద్మావ‌త్ దీపిక న‌టిస్తోంది అన‌గానే పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ వ‌చ్చింది. ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో రాజీ పాత్ర‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన స‌మంత ఈ టీమ్ తో చేరుతున్నారు అన‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఇందులో ప్ర‌భాస్ కి సామ్ జోడీగా క‌నిపిస్తుందా లేక విల‌న్ గా క‌నిపిస్తుందా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఎల్.టి.టి.ఇ టైగ‌ర్ గా న‌టించిన స‌మంత సైన్స్ ఫిక్ష‌న్ మూవీలో ఏ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తారు? అన్న‌ది వేచి చూడాలి.

అలాగే మాలీవుడ్ లో సెన్సేష‌న‌ల్ హీరోగా డైరెక్ట‌ర్ గా రాణిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేరిక‌తో మ‌ల‌యాళ మార్కెట్ కి ఊపొచ్చింది. ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు పాన్ ఇండియా స్టార్లు న‌టిస్తున్నారు. మరింత‌మంది యాడ‌ప్ అయ్యే ఛాన్సుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ నుంచి అలాగే క‌న్న‌డ రంగం నుంచి ప్ర‌ముఖ హీరోల‌కు అవ‌కాశాలు క‌ల్పించి మార్కెట్ ప‌రంగా వ్యూహం ప‌న్నుతున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాగ్ అశ్విన్- అశ్వ‌ని ద‌త్ బృందాలు ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అత‌డు న‌టించిన రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా.. మ‌రో మూడు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ .. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ నిర్మించే భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం సెట్స్ లో ఉంది. ఈ సినిమా త‌ర్వాత వార్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇదే గాక య‌ష్ రాజ్ సంస్థ నిర్మించే ధూమ్ 4 కోసం ప్ర‌భాస్ ని సంప్ర‌దించార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి మ‌రో ఐదారేళ్ల పాటు ఇండియా లెవ‌ల్లో రిలీజ‌య్యే అతి భారీ చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తారు. ఓవైపు భారీ మాస్ యాక్ష‌న్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు పురాణేతిహాసాల నుంచి ఎంపిక చేసిన క‌థ‌ల‌తో 3డి ప్ర‌యోగం చేస్తున్నాడు.