Begin typing your search above and press return to search.

'రేపటి మీ తీర్పు కోసం చాలా నెర్వస్ గా ఎగ్జైటెడ్ గా ఉన్నా'

By:  Tupaki Desk   |   10 Nov 2022 10:30 AM GMT
రేపటి మీ తీర్పు కోసం చాలా నెర్వస్ గా ఎగ్జైటెడ్ గా ఉన్నా
X
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మైయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతోంది. క్లిష్ట పరిస్థితులతో పోరాడుతున్న ఆమె ఇప్పుడు తన రాబోయే ''యశోద'' సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చాలా నెర్వస్ గా.. ఎగ్జైటెడ్ గానూ ఉందని సామ్ పేర్కొంటోంది.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'యశోద'. హరి & హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు శుక్రవారం (నవంబర్ 11) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది.

'యశోద' సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈరోజు గురువారం యూఎస్ఏలో ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యం సమంత ట్వీట్ చేస్తూ.. "చాలా నెర్వస్ గా.. ముఖ్యంగా ఉత్సాహంగా ఉంది. ఒక రోజు మాత్రమే ఉంది. మీ అందరికీ యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. రేపటి మీ తీర్పు కోసం నాలాగే ఎదురు చూస్తున్న నా దర్శకులు, నిర్మాతలు, తారాగణం మరియు మొత్తం సిబ్బందికి గుడ్ వైబ్స్" అని పేర్కొంది.

#YashodaFromTomorrow అనే హ్యాష్ ట్యాగ్ తో సమంత తన ట్వీట్‌ కు అనుగుణంగా, ఆమె తన ఫింగర్స్ ని క్రాస్ చేస్తున్న ఒక ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రేపు విడుదల కానున్న 'యశోద' సినిమా గురించి ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె ముఖంలో కూడా ఒక చిరునవ్వును కూడా మనం గమనించవచ్చు.

'యశోద' సినిమా కోసం సామ్ చాలా కష్టపడింది. యాక్షన్ సీన్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధ పడుతూ కూడా డాక్టర్ల సమక్షంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది. అయితే అనారోగ్యం కారణంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించింది.

"జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి. మరికొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కో రోజు, ఒక్కో సారి ఇంకో అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తిరిగి వెనక్కి చూస్తే.. ఇంతలా ముందుకు వచ్చానా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఇమ్యూనిటీ ఫైటింగ్ చేస్తున్నాను. వచ్చిన సమస్యతో కొట్లాడుతున్నాను. విజయం సాధిస్తాను అనుకుంటున్నాను'' అని సమంత భావోద్వేగానికి గురైంది.

''నా ఆరోగ్యం గురించి చాలా ఆర్టికల్స్ చూశాను. లైఫ్ థ్రెటెనింగ్ లో ఉన్నట్లు రాశారు. కానీ అవి నిజం కాదు. ప్రస్తుతం నేను ఉన్న స్టేజీ ప్రాణాపాయం మాత్రం కాదు. ప్రస్తుతానికైతే నేను చావలేదు. అలాంటి హెడ్ లైన్స్ అనేవి అప్రస్తుతం. కానీ, నా ఆరోగ్య పరిస్థితి.. నాకున్న వ్యాధి తీవ్రత అనేది కాస్త డిఫికల్ట్ గానే ఉంది. అయినా నేను శక్తి వంచన లేకుండా దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాను" అంటూ సామ్ కన్నీళ్లు పెట్టుకుంది.

సరోగసీ నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధానంగా తెరకెక్కిన 'యశోద' సినిమాలో సామ్ ఒక సరోగెంట్ మదర్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ - ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'జాను' తర్వాత సమంత తెలుగులోకి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.