Begin typing your search above and press return to search.

100 మిలియన్ల ట్వీట్.. బన్నీకి హీట్!

By:  Tupaki Desk   |   2 Dec 2019 11:19 AM IST
100 మిలియన్ల ట్వీట్.. బన్నీకి హీట్!
X
ఇప్పుడు దేశమంతా ఒకే చర్చ. ఆ టాపిక్ తప్ప మరొకటి మాట్లాడడం లేదు. ఏది మాట్లాడినా తిరిగి తిరిగి టాపిక్ అక్కడికే వస్తోంది. చాలామంది ఎమోషనల్ గా ఉన్నారు.. సెలబ్రిటీలు కూడా మహిళల రక్షణ గురించి ఆందోళన చెందుతూ ట్వీట్లు.. మెసేజులు పెడుతున్నారు. కొందరు వీడియో మెసేజులు కూడా పెట్టారు. అయితే భావోద్వేగాలు సున్నితంగా ఉన్న ఈ సమయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన సినిమా ట్వీట్ కు హీటు తగిలింది.

అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ 'సామజవరగమన'కు భారీ ఆదరణ దక్కింది. వ్యూస్ విషయంలో దూసుకుపోయి 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇలా అతి తక్కువ సమయంలో పది కోట్ల వ్యూస్ సాధించిన తొలి దక్షిణాది పాటగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుపుతూ ఒక పోస్టర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపాడు. అల్లు అర్జున్ షేర్ చేసిన విషయంలో ఏమాత్రం తప్పు లేదు కానీ టైమింగ్ తేడా కొట్టింది.. అసలే అందరూ ఎమోషనల్ గా ఉన్న సమయంలో ఇలాంటి సెలబ్రేషన్ ట్వీట్ చేయడం కొందరు నెటిజన్లకు నచ్చలేదు. అల్లు అర్జున్ పై విమర్శలు సంధించారు.

జరిగిన విషాదంపై స్పందన తెలుపకుండా ఈ సమయంలో 'సామజవరగమన' ఏంటి? అంటూ కొంచెం కటువైన భాషలోనే అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. ఇక్కడ రాయలేని భాషలో కొందరు బూతులు కూడా వాడారు. ఏదేమైనా అల్లు అర్జున్.. ఆయన పీఆర్ టీమ్ ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. టైమింగ్ తేడా కొడితే వివాదాలు.. ట్రోలింగ్ తప్పవు.