Begin typing your search above and press return to search.

రైతుల ఆందోళ‌న‌పై స్పందించిన స‌ల్మాన్ ఖాన్‌!

By:  Tupaki Desk   |   5 Feb 2021 10:40 AM IST
రైతుల ఆందోళ‌న‌పై స్పందించిన స‌ల్మాన్ ఖాన్‌!
X
కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్ల‌లో రెండు నెల‌లకు పైగా రైతులు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల ఉద్య‌మంపై పాప్ సింగ‌ర్ రిహ‌న్నా ట్వీట్ తో.. ఈ స‌మ‌స్య అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ నేప‌థ్యంలో ఇది భార‌త్ అంత‌ర్గ‌త విష‌య‌మంటూ ప‌లువురు బాలీవుడ్ సినిమా యాక్ట‌ర్లు స్పందించిన విష‌యం తెలిసిందే. తాజ‌గా.. ఈ విష‌యంపై బాలీవుడ్ అగ్ర‌హీరో స‌ల్మాన్ ఖాన్ స్పందించారు.

పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది రైతులు ఈ ఆందోళ‌నలో పాల్గొంటున్నారు. నవంబర్ చివరి వారం నుంచి మొద‌లైన ఈ ఆందోళ‌న‌లు ఇంకా కొన‌స‌గుతూనే ఉన్నాయి. మోడీ స‌ర్కారు తెచ్చిన ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాలు అమ‌లైతే.. త‌మ జీవితాలు కార్పొరేట్ల దయపై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రైతులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప‌లు ద‌శ‌ల్లో చ‌ర్చలు జ‌రిపిన‌ప్ప‌టికీ.. రైతుల భ‌యాందోళ‌న‌ను నివృత్తి చేయ‌డంలో విఫ‌ల‌మైంది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయింది. అంతేకాకుండా.. ఆందోళ‌న చేస్తున్న వారిని బ‌ల‌వంతంగా అక్క‌డి నుంచి పంపేసే ప్ర‌య‌త్నాలు కూడా చేసింది. ఇక‌, రిపబ్లిక్ డే సంద‌ర్భంగా జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో పాప్ సింగ‌ర్ రిహ‌న్నా చేసిన ట్వీట్ ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ‘మనం రైతుల ఆందోళన గురించి ఎందుకు మాట్లాడకూడదు?’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ట్విట్టర్ ను కుదిపేసింది. బాలీవుడ్ సినిమా నటులు, పలువురు క్రికెటర్లు ఇది అంతర్గత విషయం, మేమే పరిష్కరించుకుంటా.. ఇతరుల జోక్యం అవసరం లేదు అంటూ ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో ఒక మ్యూజిక్ షో ప్రారంభోత్సవానికి వెళ్లిన సల్మాన్ ఖాన్ ఈ విషయంపై మాట్లాడారు.

రైతుల ఆందోళన గురించి అడగగా.. చాలా క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. ‘‘సరైన పని చేయాలి. చాలా సరైన పని చేయాలి. చాలా గొప్ప పని చేయాలి.’’ అని చెప్పారు సల్మాన్. బాలీవుడ్ ఖాన్ త్రయం ఈ విషయంపై స్పందించాలని పలువురు కోరుతున్న వేళ సల్మాన్ పై విధంగా స్పందించారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంకా ఈ విషయంపై స్పందించ లేదు.