Begin typing your search above and press return to search.

సల్మాన్ 2016 నవంబర్ నే ఫిక్స్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   16 Sept 2016 7:00 PM IST
సల్మాన్ 2016 నవంబర్ నే ఫిక్స్ చేస్తున్నాడా?
X
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనేది ఒక సమయం వరకూ బిరుదు, తర్వాతి కాలంలో చిన్న సైజు హోదా అనుకుంటే.. కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అది భారంగా మారిపోతుందనడంలో సందేహం ఉండకపోవచ్చు. ఒకవయసు వరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నవారే... ఆ వయసు కాస్త పెరిగే సరికి ముదిరిపోయిన బెండకాయతో పోల్చేస్తారు. ప్రస్తుతం బిరుదు - హోదా స్థాయి దాటి భారంగా - బెండకాయగా మారిపోయిన బాలీవుడ్ కండలవీరుడికి ఇకపై ఆ బాధ - బారం దిగిపోనున్నాయని తెలుస్తుంది.

బాలీవుడ్ లో సుమారు రెండు దశాబ్ధాలుగా నానుతున్న, తిరుగుతున్న ప్రశ్నకు త్వరలో సల్మాన్ సమాధానం చెప్పనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు బాలీవుడ్‌ కండలవీరుడు సల్లూభాయ్‌ పెళ్లి వ్యవహారం మరోసారి తెరమీదికొచ్చింది. కొన్ని నెలల క్రితం తాను నవంబర్‌ లో పెళ్లి చేసుకోబోతున్నానని, కాకపోతే అది ఏ నవంబరో చెప్పడం కష్టమని సరదాగా చెప్పిన మాటను, 2016 నవంబర్ కే నిజం చేయబోతున్నాడని బాలీవుడ్ బీ టౌన్ టాక్. ఈ వార్తల ప్రకారం.. రొమానియన్‌ సుందరి యులియా వంతూర్‌ తో పెళ్లిపీటలెక్కేందుకు సల్మాన్ సన్నాహాలు చేసుకుంటున్నాడని, ఈ క్రమంలోనే ఇప్పుడు నివాసముంటున్న ఇంటినుంచి మారి వేరే అపార్ట్ మెంట్స్ కి మకాం మారుస్తున్నాడని తెలుస్తుంది.

ముంబయిలోని బాంద్రాలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌ మెంట్స్‌ లో సల్మాన్‌ ఉంటుండగా.. అదే అపార్ట్‌ మెంట్‌ లోనే వేరు వేరు ఫ్లాట్లలో అతని తల్లిదండ్రులు ఉంటున్నారు. అయితే.. యులియా వంతూర్ ని పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టడంకోసం సల్లూభాయ్‌ ఇల్లు మారుతున్నాడని, ఈ మేరకు సల్మాన్ చెప్పిన నవంబర్ నెల ఈ ఏడాదిలోనే అయ్యి ఉంటుందని గాసిప్స్ వినబడుతున్నాయి. ఈ గాసిప్స్ లో నిజం ఏమేరకు ఉందనేది తెలియాలంటే.. మరో నెలరోజులు వెయిట్ చేస్తే సరిపోతుందేమో!!