Begin typing your search above and press return to search.

'అల సాక్షి అవార్డుల వేడుకలో' అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సందడి!

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:32 AM GMT
అల సాక్షి అవార్డుల వేడుకలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సందడి!
X
కరోనా కాలు పెట్టడానికి ముందు థియేటర్లను దడదడలాడించిన సినిమాలలో 'అల వైకుంఠపురములో' ఒకటి. అల్లు అరవింద్ - రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా, 2020 జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్సుల పరంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

అలాంటి ఈ సినిమా తాజాగా జరిగిన సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో తన ప్రత్యేకతను చాటుకుంది. నిన్నరాత్రి హైదారాబాద్ లో జరిగిన 6th అండ్ 7th ఎడిషన్ సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో 'అల వైకుంఠపురములో' సినిమా వివిధ కేటగిరీలలో 5 అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ .. ఉత్తమ నటిగా పూజ హెగ్డే అవార్డులను అందుకున్నారు. ఇక ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధాకృష్ణ .. ఉత్తమ దర్శకుడు అవార్డును త్రివిక్రమ్ .. ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ వేదికపై 'అల వైకుంఠపురములో' హడావిడి .. సందడి ఎక్కువగా కనిపించాయి. ఈ వేడుకలో ఈ సినిమాదే పై చేయిగా కనిపించడం పట్ల అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'అల సాక్షి అవార్డ్సులో' అంటూ అల్లు అర్జున్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ, అవార్డులు అందుకున్న సందర్భంలోను ఫొటోను షేర్ చేశాడు. ఈ సినిమా గురించి ఇప్పటికీ అంతా మాట్లాడుకోవడం .. అవార్డులను దక్కించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశాడు. ఇది నిజంగా ఆయన అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే విషయమే.

ఇది రెండు కుటుంబాల కథ .. శ్రీమంతుల ఇళ్లలో మనుషుల మధ్య ఉన్న అగాధలకు అద్దం పట్టే కథ. స్వార్థానికీ .. ప్రేమకి మధ్య జరిగే ఘర్షణకీ .. సంఘర్షణకి సంబంధించిన కథ. అలాంటి ఈ కథను ఆసక్తికరంగా .. వాస్తవానికి దగ్గరగా త్రివిక్రమ్ ఆవిష్కరించడం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఇక 'బుట్టబొమ్మ' .. 'రాములో రాములా' .. 'సామజ వర గమనా' పాటలతో తమన్ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. అన్నీ సమపాళ్లలో కుదరడం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి గుర్తింపు .. గౌరవం లభించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.