Begin typing your search above and press return to search.

సైరాకు శాండ‌ల్ వుడ్ లో నిర‌స‌నల సెగ‌

By:  Tupaki Desk   |   3 Oct 2019 6:34 AM GMT
సైరాకు శాండ‌ల్ వుడ్ లో నిర‌స‌నల సెగ‌
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి తెలుగు రాష్ట్రాలు.. ప్ర‌పంచ దేశాలు స‌హా ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ భారీగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని కర్నాట‌క‌లోనూ అత్యంత భారీగా రిలీజ్ చేశారు. శాండ‌ల్వుడ్ పంపిణీదారులు భారీ మొత్తాల్ని వెచ్చించి డ‌బ్బింగ్ రైట్స్ కొనుక్కోవ‌డంతో ఇంత కేర్ తీసుకున్నార‌ట‌. కేవ‌లం క‌ర్నాట‌క బ‌య్య‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని బెంగ‌ళూరులో సైరా టీమ్ భారీ ఈవెంట్ ని నిర్వ‌హించింది.

అయితే ఆదిలోనే హంస‌పాదు ఎదురైంది అక్క‌డ‌. బెంగ‌ళూరు స‌హా క‌ర్నాట‌క‌లో సైరా చిత్రం రిలీజ్ వ్య‌వ‌హారంపై వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ప‌రాయి గ‌డ్డ‌కు చెందిన‌ `సైరా` చిత్రాన్ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రిలీజ్ చేశార‌ని ఆరోపిస్తున్నారు. మొదటి రోజు తెల్ల‌వారు ఝామున 3.30 ఏఎం షోల్ని వేశార‌ని .. బెంగ‌ళూరు స‌హా క‌ర్నాట‌క‌లో ప‌లు న‌గ‌రాల్లో సైరా స్పెష‌ల్ షోల‌ను తెల్ల‌వారు ఝామున వేశార‌ని ఇది చ‌ట్ట విరుద్ధ‌మ‌ని క‌న్న‌డ ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.

నిజానికి క‌ర్నాట‌క‌లో ప‌రాయి భాషా చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌ను అనుమ‌తించ‌రు. అందుకోసం ప్ర‌త్యేకించి క‌న్న‌డ ఫిలింఛాంబ‌ర్ కొన్ని నియ‌మ‌నిబంధ‌న‌ల్ని రూపొందించుకుంది. ఇరుగు పొరుగు సినిమా డామినేష‌న్ త‌మ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం చూప‌కూడ‌ద‌న్న‌ది ఆ రూల్ బుక్ నియ‌మం. కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టం-2014 ఈ విష‌యాల్ని ప్ర‌స్థావిస్తోంది. ఇందులో నియ‌మాల‌కు విరుద్ధంగా సైరా చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారని.. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు.. ప్రముఖ ఎగ్జిబిటర్ కేవీ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇక ఇదే రూల్ బుక్ లో ఓ ఆస‌క్తిక‌ర నియ‌మాన్ని పొందుప‌రిచారు. బెంగళూరు సహా కర్ణాటకలోని కొన్ని ప్రధాన నగరాల్లో పరభాషా సినిమాలను తెల్లవారు జామున థియేటర్లో ప్రదర్శించడంపై నిషేధం ఉంది. ఉదయం 8 గంటల తరువాతే ఆయా సినిమాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ మేరకు కర్ణాటక సినిమాల క్రమబద్దీకరణ చట్టంలోని సెక్షన్ 41లో ఓ క్లాజు ఉన్నా సైరా టీమ్ దానిని ప‌ట్టించుకోలేద‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే అన్ని నియ‌మాల్ని ఉల్లంఘించి సైరా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న సాగుతోంది. 8ఏఎం త‌ర్వాత అన్న రూల్ ని బ్రేక్ చేసి తొలిరోజు తెల్ల‌వారు ఝామున 3.30కే బెంగ‌ళూరులో 42 స్పెష‌ల్ షోలు వేశార‌ట‌. అలాగే ప‌లు న‌గ‌రాల్లోనే ఇదే తీరుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపిస్తున్నారు. ఈ వివాదాన్ని తెర‌పైకి తెచ్చిన క‌న్న‌డ ఫిలింఛాంబ‌ర్ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. ఇక భార‌త‌దేశంలోనే నాశిర‌కం సినిమాలు తీసే పరిశ్ర‌మ‌గా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ లోగుట్టు గురించి ఇప్ప‌టికే బోలెడంత చ‌ర్చ సాగుతోంది. ఇలా ప‌ర‌భాషా చిత్రాల్ని క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా ఆ ప‌రిశ్ర‌మ ఎంత‌వ‌ర‌కూ ఎదుగుతుంది? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కం అని విమ‌ర్శిస్తున్నారు కొంద‌రు.