Begin typing your search above and press return to search.

గని తో మాయ చేయనున్న దబాంగ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 3:33 PM GMT
గని తో మాయ చేయనున్న దబాంగ్ బ్యూటీ..!
X
బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సైఈ ఎమ్ మంజ్రేకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'దబాంగ్ 3' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సైయీ.. ఫస్ట్ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అమ్మడికి హిందీ అవకాశాలు కరువయ్యాయి. అయితేనేం టాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

మహేష్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కనున్న 'మేజర్' సినిమాలో సైయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకంటే ముందే ''గని'' చిత్రంతో సైయీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. ఇందులో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తుండగా.. ఆయనకు జోడీగా సైఈ మంజ్రేకర్ నటిస్తోంది. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. శనివారం సైయీ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో దబాంగ్ బ్యూటీ 'మాయ' అనే యువతి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో విడుదల చేసిన పోస్టర్ లో సైయీ మంజ్రేకర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. 'మేజర్' కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది కాబట్టి.. ఈ బ్యూటీకి 'గని' టాలీవుడ్ డెబ్యూ అవుతుంది. మరి ఈ సినిమా బాలీవుడ్ భామకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

'గని' చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు వెంకటేష్ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో నదియా - జగపతిబాబు - సీనియర్ నరేష్ - తనికెళ్ళ భరణి - ఉపేంద్ర - సునీల్ శెట్టి - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'గని' టీజర్ ను నవంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.