Begin typing your search above and press return to search.

పూరి తమ్ముడు హర్టయ్యాడు

By:  Tupaki Desk   |   13 Sep 2016 1:30 PM GMT
పూరి తమ్ముడు హర్టయ్యాడు
X
అన్నయ్య స్టార్ డైరెక్టర్. ఇక తమ్ముడికి వచ్చిన ఇబ్బందేముంటుంది..? ఈజీగా హీరో అయిపోవచ్చు. కానీ సాయిరాం శంకర్ మాత్రం హీరో కావడానికీ ఇబ్బంది పడ్డాడు. అలాగే హీరోగా నిలదొక్కుకోవడానికి మరింతగా ఇబ్బంది పడుతున్నాడు. తమ్ముడిని హీరోను చేయడానికి ముందు చాలా పరీక్షలే పెట్టాడు పూరి. ముందు చిన్న చిన్న పాత్రలు చేయించాడు. ఆ తర్వాతే హీరోగా అవకాశం ఇచ్చాడు. ఐతే అన్ని పరీక్షల్ని దాటుకుని వచ్చినా.. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు సాయిరాం. ‘బంపర్ ఆఫర్’ మినహాయిస్తే చెప్పుకోదగ్గ సినిమా లేదు అతడి కెరీర్లో. వాయిదాల మీద వాయిదాలు పడి గత ఏడాదే విడుదలైన ‘రోమియో’ కూడా అడ్రస్ లేకుండా పోయింది.

ఆ తర్వాత ఇంకో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు సాయిరాం. అందులో ఒకటి ‘అరకు రోడ్‌ లో’. ఈ సినిమా ఆడియో తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ.. మీడియాలో తనగురించి వచ్చే వార్తలు చదివి ఫీలైనట్లు చెప్పాడు. తనకు వరుసగా ఫ్లాపులు వస్తున్నా ప్రయత్నాలు ఆపట్లేదని.. దీనిపై మీడియా వాళ్లు తాను గజిని లాగా బాక్సాఫీస్ మీదికి దండయాత్ర చేస్తూనే ఉన్నానని రాస్తున్నారని సాయిరాం అన్నాడు. ఐతే ఈ విషయంలో తనకు షేమ్ అనిపించట్లేదని.. ఇలా ప్రయత్నం చేయడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదని సాయిరాం అన్నాడు. ప్రయత్నం ఆపేస్తే.. అప్పుడే సిగ్గుపడాలని సాయిరాం చెప్పాడు. మరి సాయిరాం ప్రయత్నం ‘అరకు రోడ్‌ లో’ ద్వారా అయినా ప్రయత్నించి.. అతను సక్సెస్ అవుతాడేమో చూడాలి.