Begin typing your search above and press return to search.

టైటిల్ పెట్టేందుకు కూడా బద్దకమా?

By:  Tupaki Desk   |   23 March 2019 10:04 AM IST
టైటిల్ పెట్టేందుకు కూడా బద్దకమా?
X
కేవలం హీరో హీరొయిన్ల క్రేజ్ మీద సినిమాలు ఆడే రోజులు కావివి. కంటెంట్ చాలా ముఖ్యం. అది స్ట్రెయిట్ మూవీ అయినా డబ్బింగ్ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాని అదేంటో విచిత్రంగా కొందరి ఆలోచన ధోరణి చూస్తుంటే తెలుగు అంటే మరీ అంత చులకనగా ఉందా అనిపిస్తుంది. విషయానికి వస్తే సాయి పల్లవి మలయాళంలో మూడేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన అతిరన్ అనే మూవీ తెలుగులో డబ్ చేస్తున్నారు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చింది.

విచిత్రంగా తెలుగు వెర్షన్ కు కూడా అదే పేరు పెట్టారు. ఇందులో సాయి పల్లవి తప్ప ఇంకెవరు మనవాళ్ళకు ముఖ పరిచయం కూడా లేదు. ఈవిడ మొహం చూసే థియేటర్ కు రావాలి తప్ప అదనపు కారణం ఒక్కటీ లేదు. అలాంటప్పుడు కాస్త తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే పేరు పెడితే బాగుండేది.

ఇది మొదటిసారి కాదు. గతంలో ధనుష్ నటించిన మరియన్ విషయంలోనూ ఇలాగే చేశారు. విజయ్ అంటోనీ ఓవర్ కాన్ఫిడెన్సు తో యమన్ అనే పేరుని తెలుగులో మొండి ధైర్యంతో పెట్టుకున్నాడు. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. అసలు అర్థం కాని పేరు పెడితే ప్రేక్షకులు హాల్ కు పొలోమని వచ్చేస్తారని ఎలా అనుకున్నారో ఏమిటో.

ఇప్పుడీ అతిరన్ వరస చూస్తుంటే ఏదో మొక్కుబడిగా విడుదల చేసి సాయి పల్లవి క్రేజ్ తో నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే ప్రయత్నం తప్ప ఇంకేమి కనిపించడం లేదు. మముట్టి మోహన్ లాల్ లాంటి మెగాస్టార్ల డబ్బింగ్ సినిమాలకే తెలుగులో దిక్కు లేదు. అలాంటిది ఇలా అర్థం కాని టైటిల్ పెట్టి సాయి పల్లవి ఉంది చూసుకోండి అంటే జనం వచ్చేస్తారా. దీన్ని ఏ రకం అమాయకత్వం అంటారో సదరు నిర్మాతలకే తెలియాలి