Begin typing your search above and press return to search.

చిరు గొప్పదనమేంటో చెప్పిన స్టార్ రైటర్

By:  Tupaki Desk   |   4 April 2018 3:44 PM IST
చిరు గొప్పదనమేంటో చెప్పిన స్టార్ రైటర్
X
రాజకీయాల సంగతలా వదిలేస్తే సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అలాంటిలాంటివి కావు. ఆయన్ని దేవుడిలా కొలిచే వాళ్లు కోట్లల్లో ఉన్నారు. సినిమాతో ముడిపడ్డ ప్రతి ఒక్కరూ ఆయన్ని అమితంగా గౌరవిస్తారు. ఒక సినిమా చేసేటపుడు ఆయన నిర్మాత దగ్గర్నుంచి పాటు థియేటర్లో సైకిల్ స్టాండ్ నడిపేవాడి వరకు అందరి గురించి ఆలోచిస్తాడని అంటారు. ఇదే విషయమై స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఒక ఇంటర్వ్యూలో చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో మాట్లాడిన ప్రతి సందర్భాల్లోనూ సినిమాను నమ్ముకున్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు గురించి చిరు చర్చిస్తాడని ఆయన అన్నారు.

తాను ఒక కథ ఎంచుకునే ముందు థియేటర్లో క్యాంటీన్ వాడి గురించి కూడా ఆలోచిస్తానని చిరు తనతో చెప్పినట్లు సాయిమమాధవ్ తెలిపాడు. చిరంజీవి సినిమా వస్తే నాలుగు డబ్బులు వెనకేసుకుని తన బిడ్డ పెళ్లిచేయొచ్చని క్యాంటీన్ నడిపేవాడు ఆలోచించొచ్చని.. అలాంటి వాళ్లకు కూడా ఆనందం మిగిల్చే సినిమా అందించాలన్నది తన ఉద్దేశమని చిరు తనతో అన్నట్లు సాయిమాధవ్ తెలిపాడు. ఈ రోజుల్లో ఏ హీరో అయినా ఇలా ఆలోచిస్తాడా.. అసలు నిర్మాతల గురించే ఆలోచించేవాళ్లు తక్కువైపోయారని సాయిమాధవ్ చెప్పాడు. తనకు చిన్నప్పటి నుంచే చిరంజీవి అంటే అమితమైన అభిమానం.. గౌరవం ఉన్నాయని.. ఇలాంటి మాటలు విన్నాక ఆయనపై ఉన్న గౌరవం మరింత పెరిగిందని ఆయన అన్నాడు. సాయిమాధవ్ చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ఆయన కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా రచన చేశాడు.