Begin typing your search above and press return to search.

చిరంజీవి నోట నా డైలాగులా!

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:46 AM GMT
చిరంజీవి నోట నా డైలాగులా!
X
చిరంజీవి లాంటి స్టార్ హీరో తాను రాసిన డైలాగుల్ని గుర్తు పెట్టుకుని చెబుతుంటే తాను ఉక్కిరి బిక్కిరి అయిపోయానని అంటున్నాడు సాయిమాధవ్ బుర్రా. కృష్ణం వందే జగద్గురుం - గోపాల గోపాల - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో మాటల రచయితగా గొప్ప పేరు సంపాదించిన సాయిమాధవ్.. తాజాగా ‘కంచె’ సినిమాతో మరింతగా ప్రశంసలందుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాను చాలా కాంప్లిమెంట్స్ అందుకున్నానని.. ఐతే చిరంజీవి తనను పొగడటం, గుర్తుంచుకుని డైలాగులు చెప్పడం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని అంటున్నాడు సాయిమాధవ్.

‘‘మెగాస్టార్ చిరంజీవి గారు కంచె సినిమా చూశాక నన్ను తన దగ్గరికి పిలిపించుకుని మరీ అభినందించారు. సినిమాలోని డైలాగులు ఆయన నోటి వెంట వస్తుంటే ఆశ్చర్యపోయాను. ఆయన ప్రశంసిస్తుంటే నాకు చెమట పట్టేశాయి. చిరంజీవి గారి సినిమాకు మాటలు రాసే అదృష్టం దక్కుతుందా అని ఆశ పడుతున్న నాకు.. ఆయన నోటి వెంట నా సినిమా డైలాగులు వినడం గొప్ప అనుభూతిని మిగిల్చింది. ‘కంచె’ మాటల గురించి చాలా చర్చ జరుగుతోంది. కులం డైలాగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ డైలాగులు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ ఈ డైలాగులు అలరిస్తున్నాయి. ఐతే ఇంత మంచి డైలాగులు రాసేందుకు అవకాశం కల్పించింది క్రిష్. ఆయన అంత గొప్ప కథ రాసి, సినిమా తీశాడు’’ అని సాయిమాధవ్ చెప్పాడు.