Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే అయి తీరతానంటున్న నాలుగో సింహం

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:00 PM IST
ఎమ్మెల్యే అయి తీరతానంటున్న నాలుగో సింహం
X
సినిమా వాళ్లకు రాజకీయాల్లోకి రావాలని ఎక్కడో ఓ మూల కోరిక ఉంటుంది. అందులోనూ సినిమాల్లో ఓ స్థాయి అందుకున్నాక.. తర్వాతి టార్గెట్ రాజకీయాలే అవుతాయి. ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అందులో కొందరు విజయవంతమయ్యారు. కొందరు విఫలమయ్యారు. అయినప్పటికీ ఈ ఒరవడి మాత్రం ఆగలేదు. డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న సాయికుమార్ కు కూడా రాజకీయాలపై బాగానే ఆసక్తి ఉంది. గతంలోనే రాజకీయాల మీద ఆసక్తి చూపించిన సాయికుమార్.. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. కానీ విజయం దక్కలేదు. అయినప్పటికీ ప్రయత్నం కొనసాగిస్తానని.. ఏదో ఒక రోజు ఎమ్మెల్యే అయి తీరుతానని అంటున్నాడు డైలాగ్ కింగ్.

‘‘2004లోనే ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా. కానీ అవకాశం కొద్దిలో పోయింది. తర్వాత మా అమ్మగారి ఊరైన బాగేపల్లి (కర్ణాటక)కి ఏదైనా చేయాలని అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా. జేడీఎస్‌ - కమ్యూనిస్టులకు కంచుకోట అది. విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయా. తర్వాత కర్ణాటక రాజకీయాలు గందరగోళంగా మారడంతో వెనక్కి తగ్గా. బాగేపల్లి ప్రజలకు మాత్రం సాయికుమార్‌ మళ్లీ రావాలని ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. గత ఎన్నికల్లో మా నాన్న గారి ఊరైన విజయనగరంలో పోటీ చేద్దామనుకున్నా. ఐతే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే నేనే అక్కడ ఆ పార్టీ తరఫున బరిలో ఉండేవాణ్ని. కానీ పొత్తులో భాగంగా విజయనగరం టీడీపీకి వెళ్లిపోయింది. దీంతో ప్రచారానికే పరిమితమయ్యా. భవిష్యత్తులో బాగేపల్లి నుంచో లేక మరో చోటి నుంచో ఎమ్మెల్యే అయి తీరుతా’’ అని చెప్పాడు సాయికుమార్.