Begin typing your search above and press return to search.

గాయాలతో ఉన్న తేజ్ కోసం 108 కోసం ఫోన్ చేసింది ఇతడే

By:  Tupaki Desk   |   12 Sep 2021 3:25 AM GMT
గాయాలతో ఉన్న తేజ్ కోసం 108 కోసం ఫోన్ చేసింది ఇతడే
X
రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం. నిత్యం ప్రతి నిమిషంలో హైదరాబాద్ మహానగరంలోని ఏదో ఒక చోట చిన్నా.. పెద్దా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించటంచాలా అవసరం. ప్రాణాల మీదకు రాకుండా ఉండేందుకు గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంట లోపే) లో ఆసుపత్రికి తరలించగలిగితే.. గాయపడిన వారిని చాలావరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది.

తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరు మేనల్లుడు కమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఎపిసోడ్ అందరికి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలో అతన్ని గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించటంలో ముగ్గురు కీలక భూమిక పోషించారు. ఆ ముగ్గురు ఎవరికి వారు తమ వంతు ధర్మాన్ని పాటించారనే చెప్పాలి. వీరే.. పెను ప్రమాదం నుంచి తేజ్ ను రక్షించారని చెప్పాలి.

ప్రమాదానికి కారణం అతి వేగం అని చెబుతున్నా.. రోడ్డు మీద ఉన్న ఇసుక మేట కారణంగా బైక్ స్కిడ్ కావటాన్ని మర్చిపోకూడదు. వేగంగా వెళుతున్న తేజ్ వెహికిల్.. రోడ్డు మీద ఇసుక మేట లేదనే అనుకుందాం. అప్పుడు ప్రమాదం జరిగేదా? అన్నది మరో ప్రశ్న. ప్రమాదంలో గాయాల బారిన పడిన వేళలో.. సాయి ధరమ్ తేజ్ సినిమా హీరో అని.. చిరంజీవి మేనల్లుడు అన్న విషయాలేమీ తెలీవు. అంబులెన్సులో మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అతన్ని గుర్తించారు. ప్రమాదం జరిగి.. గాయాలబారిన పడిన వేళలో.. ప్రమాదం చెంతనే ఉన్న అబ్దుల్ అనే వ్యక్తి తన బాధ్యతను తొలుత పక్కాగా నిర్వర్తించాడు. ప్రమాదాన్ని చూసినంతనే తన బైక్ ను నిలిపి.. వెంటనే 108కు ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేశారు.

గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలోకి చేరటానికి కారణమయ్యాడు. నిజానికి ప్రమాదం జరిగిన కాసేపటికి.. తేజ్ కు ఫిట్స్ వచ్చాయి. వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 108కు ఫోన్ చేయటమే కాదు.. అంబులెన్సు వచ్చే వరకు వెయిట్ చేయటం.. ఆసుపత్రికి తరలించటంలోనూ తన వంతు సాయం చేశాడు. ఆసుపత్రిలోనూ వెంట ఉన్నాడు. ఇంతకూ అబ్దుల్ ఏం చేస్తుంటాడు? అసలు ఆ వేళలో అతను ఎక్కడికి వెళుతున్నాడు? అన్న విషయంలోకి వెళితే.. అతను అమీర్ పేటలోని సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగ్ లో ఉద్యోగం చేస్తుంటాడు.

నిజాంపేటలో అతనికి పని ఉండటంతో జూబ్లీహిల్స్.. దుర్గంచెరువు కేబుల్ వంతెన.. హైటెక్ సిటీ.. జేఎన్ టీయూ మీదుగా వెళ్లేందుకు టూ వీలర్ మీద వెళుతున్నాడు. తాను వెళుతున్న దారిలో జరిగిన ప్రమాదాన్ని చూసినంతనే.. తన పనిని పక్కన పెట్టి.. వెంటనే డయల్ 100కు.. అంబులెన్సు కోసం 108కు ఫోన్ చేసి.. సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అంబులెన్సు వారు వెంటనే స్పందించి.. కేవలం 10 నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకోవటంతో పాటు.. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లటంలో కీలక భూమిక పోషించారు.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించారు. డయల్ 100 నుంచి ప్రమాదంపై ఆయనకు సమాచారం అందిన వెంటనే.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. ఈ ముగ్గురి తక్షణ స్పందన సాయి ధరమ్ తేజ్ సేవ్ కావటానికి కారణమైందని చెప్పక తప్పదు.