Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడితో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరో మూవీ..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 10:02 AM GMT
మెగా మేనల్లుడితో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మరో మూవీ..!
X
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందిన 'ప్రతిరోజూ పండగే' సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే వీరి కాంబోలో మరో మూవీ రానున్నట్లు తెలుస్తోంది. లేటెస్టుగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మారుతి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

సాయి తేజ్ వినాయక చవితి రోజు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తేజ్.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా మెగా హీరోలందరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో.. మెగా మేనల్లుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో తేజ్ తో సినిమా ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు.

''యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయి తేజ్ ని కలిశాను. ఆయన చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు. ఎంతో ఎనర్జీగా చాలా బాగున్నాడు. 'సుప్రీమ్' సినిమా టైంలో తేజ్ సన్నగా ఎంత బాగున్నాడో.. ఇప్పుడు అంత బాగున్నాడు. తేజ్ తో డెఫినెట్ గా మళ్ళీ సినిమా చేస్తాను. ఇప్పటికే ఓ లైన్ కూడా అనుకున్నాం. టైం కుదరాలి అంతే'' అని డైరెక్టర్ మారుతీ చెప్పుకొచ్చారు.

కాగా, మారుతీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ - మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన 'మంచి రోజులొచ్చాయి' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పుడు గోపీచంద్ - రాశి ఖన్నా కాంబినేషన్ లో 'పక్కా కమర్షియల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతీ. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో మారుతి ఓ మూవీ ప్లాన్ చేసుకుంటున్నారు.

మరోవైపు సాయి తేజ్ ఇటీవల 'రిపబ్లిక్' సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. రాబోయే రోజుల్లో 'భమ్ బోలేనాథ్' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయి తేజ్ ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాకుండా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. దీని తర్వాత మారుతి డైరెక్షన్ లో తేజ్ సినిమా ఉంటుందేమో చూడాలి.