Begin typing your search above and press return to search.

బాహుబలిని చంపడానికి అంత కష్టపడ్డారు

By:  Tupaki Desk   |   6 April 2017 1:07 PM GMT
బాహుబలిని చంపడానికి అంత కష్టపడ్డారు
X
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. ఇప్పుడు దేశంలో కోట్లాది మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు ఇంకో మూడు వారాల్లో సమాధానం దొరకనుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో రాజమౌళి బృందం ఎన్ని అద్భుతాలు ఆవిష్కరించి ఉన్నా.. జనాలు అత్యంత ఉత్కంఠగా చూసేది మాత్రం బాహుబలిని కట్టప్ప పొడిచే సన్నివేశాన్నే అనడంలో సందేహం లేదు. ఈ ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే ఆ సన్నివేశం చిత్రీకరణ కోసం చాలా చాలా కష్టపడిందట బాహుబలి టీం. ఆ కష్టం గురించి ‘బాహుబలి’ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ చెబుతున్న మాటలు వింటే.. ఔరా అనిపించడం ఖాయం. ఇంతకీ ఆ సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో సాబు ఏమన్నాడంటే..

‘‘నిజానికి ఈ సన్నివేశాన్ని ముందు చంబల్ లోయలో తీయాలనుకున్నాం. అందుకోసం సన్నాహాలు చేసుకుంటుండగా.. వర్షాలు పడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం పచ్చగా మారిపోయింది. మేం అనుకున్న దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది ఆ ప్రాంతం. దీంతో వేరే లొకేషన్ చూసుకోక తప్పలేదు. హైదరాబాద్ శివార్లలోని ఒక క్వారీ దగ్గర ఈ సీన్ షూట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. కానీ రాజమౌళి ఆలోచనలకు తగ్గట్లుగా ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయడం చాలా చాలా కష్టమైంది. అక్కడికి వంద ట్రక్కుల బురద మట్టిని తెప్పించాం. రోడ్లు వేశాం. ఇక అక్కడున్న పెద్ద పెద్ద బండ రాళ్లన్నింటికీ మట్టి రంగులో పెయింటింగ్ వేయించాం. అక్కడ ఒక్కొక్కటి 60 అడుగులు ఎత్తున్న బండ రాళ్లున్నాయి. అలాగే రాజస్థాన్ నుంచి చెట్లు తెప్పించి నాటించాం. వాటిని పోలిన చెట్లను కృత్రిమంగా తయారు చేయించి బ్యాక్ డ్రాప్‌లో పెట్టాం. 45 రోజుల పాటు 200 మందికి పైగా నిరంతరం పని చేస్తే కానీ మేం అనుకున్నట్లుగా సెట్ తయారవ్వలేదు. ఇంత కష్టం మరే సినిమాకూ పడలేదు. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం కావడంతో ఏ విషయంలోనూ రాజీ పడలేదు’’ అని సాబు తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/