Begin typing your search above and press return to search.

ట్రైలర్ 2 టాక్: యాక్షన్ ప్లస్ రొమాన్స్

By:  Tupaki Desk   |   6 July 2018 2:43 PM GMT
ట్రైలర్ 2 టాక్: యాక్షన్ ప్లస్ రొమాన్స్
X
మొదటిసారి విడుదల చేసిన ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన అరెక్స్ 100 రెండో ట్రైలర్ ని ఇవాళ విడుదల చేసారు. అజయ్ భూపతి దర్శకత్వంలో డెబ్యూ మూవీగా వస్తున్న అరెక్స్ 100లో కార్తీక్ గుమ్మకొండ హీరో కాగా పాయల్ రాజపుత్ హీరోయిన్. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ రూపొందిన విషయాన్ని గతంలోనే క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి బలమైన ఎమోషన్స్ తో పాటు కావలసినంత యాక్షన్ రొమాన్స్ కూడా ఉందని చూపించే ప్రయత్నం కొత్త ట్రైలర్ లో చేసారు. తానెంతో ఇష్టపడి వాడుతున్న బైక్, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు, ఊరి పెద్దతో శత్రుత్వం, కనిపించని యుద్ధం చేస్తున్న తండ్రి ఇలా పర్ఫెక్ట్ టోన్ లో అన్ని మిక్స్ చేసి దర్శకుడు అజయ్ భూపతి దీన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. వీటితో పాటు హీరో హీరోయిన్ మధ్య హాట్ రొమాన్స్ ని బాగా ప్రొజెక్ట్ చేసినట్టు మరోసారి స్పష్టమైంది. పొలాల మధ్య ప్రేమ సామ్రాజ్యం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

రఫ్ నెస్ తో హై లెవెల్ ఇంటెన్సిటీ ని బాగా క్యారీ చేసిన హీరో కార్తీక్ గుమ్మకొండ ఆ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. మెయిన్ విలన్ గా రావు రమేష్ మరో కీలక పాత్రలో సింధూర పువ్వు ఫేమ్ రాంకీ చాలా కాలం తర్వాత తెలుగు స్ట్రెయిట్ మూవీలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. టైటిల్ నే పాత వింటేజ్ మోడల్ బైక్ ను పెట్టిన దర్శకుడు కథలో అంత బలమైన లింక్ ఏం పెట్టుంటాడా అనే ఆసక్తి కలుగుతోంది. పల్లెటూరి నేపధ్యంతో పాటు వర్తమానానికి దూరంగా టెక్నాలజీ గోల లేకుండా స్వచ్ఛమైన ప్రేమ కథగా దీన్ని తెరకెక్కించాను అని చెబుతున్న దర్శకుడు అజయ్ భూపతి అరెక్స్ 100తో మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేతతో పోటీ పడనున్నాడు. జులై 12న విడుదల కానున్న అరెక్స్ 100 టీమ్ చేసిన ప్రమోషన్ వల్ల ఇప్పటికీ దీని మీద మంచి అంచనాలు రేగుతున్నాయి. వాటిని అందుకుంటే కనక సినిమా బ్లాక్ బస్టరే. సరైన హిట్ లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు అరెక్స్ 100 ఎంతవరకు ఊపునిస్తుందో వేచి చూడాలి.