Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ 100.. అక్కడ తుస్సే

By:  Tupaki Desk   |   18 July 2018 8:07 AM GMT
ఆర్ ఎక్స్ 100.. అక్కడ తుస్సే
X
గత గురువారం విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే రూ.7 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. బయ్యర్ల పెట్టుబడి మీద ఇప్పటికే మూడు రెట్ల దాకా షేర్ వచ్చింది. ఫుల్ రన్లో రూ.10 కోట్ల మార్కును కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల వరకు దీన్ని కేవలం ‘బ్లాక్ బస్టర్’ అనలేం. అంతకుమించిన విజయమిది. వీకెండ్ తర్వాత కూడా అదిరిపోయే వసూళ్లతో సాగిపోతోందీ చిత్రం. ఐతే అమెరికాలో మాత్రం ఈ చిత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. అలాగని దీనికి అక్కడ ప్రి రిలీజ్ బజ్ లేదని అనుకోవడానికి లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరే మంచి హైప్ రావడంతో దాదాపు వంద లొకేషన్లలో దీన్ని రిలీజ్ చేశారక్కడ. పెద్ద ఎత్తున ప్రిమియర్లు కూడా వేశారు.

కానీ ‘ఆర్ఎక్స్ 100’ అక్కడ నామమాత్రపు వసూళ్లతో సాగిపోతోంది. ఇప్పటిదాకా అక్కడ ఈ చిత్రం లక్ష డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా స్థాయికి ఇది చెప్పుకోదగ్గ మొత్తమే. కానీ దీనికి వచ్చిన హైప్.. రిలీజ్ రేంజ్ ప్రకారం చూస్తే ఇవి పెద్ద వసూళ్లేమీ కాదు. రివ్యూలు పూర్తి నెగెటివ్ గా రావడం దీనికి ప్రతికూలంగా మారినట్లుంది. యుఎస్ లో రివ్యూల్ని బట్టే సినిమాలకు జనాలు వెళ్తారు. చాలా దూరం ప్రయాణించి.. పెద్ద మొత్తం ఖర్చు పెట్టుకుని సినిమా చూస్తారు కాబట్టి.. రివ్యూలు నెగెటివ్ గా ఉంటే థియేటర్లకు జనాలు వెళ్లరు. నిజానికి ఈ సినిమా ఇలా ఆడుతుండటానికి ఇందులోని బోల్డ్ కంటెంట్ ప్రధాన కారణం అన్నది స్పష్టం. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు. మాస్ ఏరియాల్లో ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. కానీ యుఎస్ ప్రేక్షకులు ఈ బోల్డ్ కంటెంట్ ను కాకుండా సినిమాలో ఉన్న అసలు కంటెంట్ చూస్తున్నారు. అందుకే అక్కడ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోందని తెలుస్తోంది.