Begin typing your search above and press return to search.

చిన్న సినిమా.. మామూలు సంచలనం కాదు

By:  Tupaki Desk   |   31 Aug 2018 3:58 AM GMT
చిన్న సినిమా.. మామూలు సంచలనం కాదు
X
పెట్టుబడి-లాభాల కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో వచ్చిన అతి పెద్ద హిట్లలో ‘ఆర్ ఎక్స్ 100’ ఉంటుంది. ఈ చిత్రంపై కోటిన్నర బడ్జెట్ పెట్టి.. రెండున్నర కోట్లకు బయ్యర్లకు అమ్మితే దానికి ఐదు రెట్ల షేర్ వచ్చింది. బయ్యర్లకు నాలుగైదు రెట్లు లాభాలు రావడమంటే మామూలు విషయం కాదు. తొలి వారమంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ వసూళ్లతో సాగిపోయిందీ చిత్రం. తర్వాతి వారాల్లో కూడా మంచి వసూళ్లే వచ్చాయి. ముందు రిలీజ్ చేసిన థియేటర్లకు అదనంగా స్క్రీన్లు - షోలు పెంచాల్సిన పరిస్థితి కల్పించిందీ చిత్రం. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తాజాగా అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకుంది. దీని 50 డేస్ సెంటర్లు ఎన్నో తెలిస్తే షాకవ్వాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 26 సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు ఆడటం విశేషం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు కూడా మూణ్నాలుగు వారాలు తిరిగేసరికి థియేటర్లలో నిలబడట్లేదు. అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో కేంద్రాల్లో 50 రోజులు ఆడుతున్నాయి. చివరగా ‘రంగస్థలం’ ఇలా ఆడింది. ఐతే ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి చిన్న సినిమాకు ఇన్ని కేంద్రాల్లో లాంగ్ రన్ రావడం అసాధారణ విషయమే. నైజాంలో ఆరు కేంద్రాల్లో.. ఆంధ్రాలో 13 కేంద్రాల్లో.. సీడెడ్లో 7 కేంద్రాల్లో ఈ చిత్రం అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఇవి జెన్యూన్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కొత్త దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రంలో కార్తికేయ.. పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. ఈ చిత్రం తర్వాత ఈ ముగ్గురికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.