Begin typing your search above and press return to search.

#RRR : మరో పులిహోర పుకారు

By:  Tupaki Desk   |   25 Nov 2018 3:55 AM GMT
#RRR : మరో  పులిహోర పుకారు
X
ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ లతో రాజమౌళి సినిమా సంవత్సరం క్రితం ప్రారంభించి, ఎట్టకేలకు పట్టాలెక్కించాడు. ఈ సంవత్సర కాలంలో ఈ మల్టీస్టారర్‌ మూవీ గురించి ఎన్నో పుకార్లు వచ్చి పోయాయి. రాజమౌళి సినిమాకున్న క్రేజ్‌ అలాంటిది మరి. అయితే పుకార్లంటే కొన్ని అవునా అనేట్లుగా ఉండాలి కాని, కొన్ని పుకార్లు మరీ సిల్లీగా ఉంటున్నాయి. ఇటీవలే ఈ మల్టీస్టారర్‌ లో కన్నడ స్టార్‌ హీరో యష్‌ విలన్‌ గా నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి, అయితే అవి పుకార్లేనని, తనను ఎవరు కూడా ఆ చిత్రం కోసం సంప్రదించలేదని యష్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఇషా రెబ్బా ఈ చిత్రంలో నటించబోతుందనే పుకారు పుట్టుకొచ్చింది.

ఈషా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మల్టీస్టారర్‌ లో నటిస్తుందంటే సరే, ఏదైనా చిన్న పాత్రకు ఆమెను తీసుకున్నారేమో అనుకోవచ్చు. కాని అసలు ఆ పుకారు ఏంటీ అంటే మల్టీస్టారర్‌ లో ఎన్టీఆర్‌ కు చెల్లిగా ఈషా రెబ్బా కనిపించబోతుందట. ఎన్టీఆర్‌ గత చిత్రం ‘అరవింద సమేత’ లో మరదలుగా నటించిన ఈషా రెబ్బా ఈ చిత్రంలో చెల్లిగా ఎలా నటిస్తుందో వారికే తెలియాలి. ఎన్టీఆర్‌ పాత్ర ఏంటో తెలియదు, అసలు ఆర్‌ మల్టీస్టారర్‌ కథేంటో తెలియదు కాని ఎన్టీఆర్‌ చెల్లి పాత్రలో ఈషా అంటూ పులిహోరా పుకారు పుట్టించి కొందరు కామెడీ చేస్తున్నారు. ఈషా రెబ్బా పుకారును సన్నిహితుల ద్వారా తెలుసుకున్న జక్కన్న నవ్వుకున్నాడట. ఇలాంటి గాసిప్స్‌ పై జక్కన్న స్పందించేందుకు ఆసక్తి చూపించడనే విషయం తెల్సిందే.

ఈ మల్టీస్టారర్‌ పై క్రేజ్‌ భారీగా ఉన్న నేపథ్యంలో ప్రతి చిన్న వార్తకు, పుకారుకు భారీ ప్రాచుర్యం దక్కుతుంది. అందుకే ఇలాంటి చిల్లర పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సంవత్సరంనర ఉంది. ఈ గ్యాప్‌ లో ఇలాంటి పులిహోర పుకార్లు ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో.

ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించిన జక్కన్న త్వరలోనే సినిమాలో నటించబోతున్న హీరోయిన్స్‌ ఎవరు, విలన్‌ ఎవరు అనే విషయమై స్పష్టత ఇవ్వబోతున్నాడు. 2020వ సంవత్సరంలో ఈ చిత్రం వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దానయ్య భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.