Begin typing your search above and press return to search.

టాలీవుడ్ మీద నింద పడిందా... ?

By:  Tupaki Desk   |   11 Oct 2021 4:30 PM GMT
టాలీవుడ్ మీద నింద పడిందా... ?
X
టాలీవుడ్ అంటే అందరిదీ అన్న భావన ఉంది. ముంబై తరువాత దేశంలో టాలీవుడ్ అతి పెద్ద పరిశ్రమగా చెబుతారు. టాలీవుడ్ అంటే బాలీవుడ్ కూడా మోజు పడుతుంది. టాలీవుడ్ లో ఎందరో ముంబై కళాకారులు నటించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ముంబై టూ హైదరాబాద్ ఫ్లైట్లు జోరుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమాలకు మొదట ముంబై నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత విలన్లను తెచ్చారు, ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్టులను కూడా తీసుకువస్తున్నారు. వారిని సొంతం చేసుకుని మరీ తెలుగువారి తమ అభిమాన నటులుగా చేసుకున్నారు. అలా ఎందరో అచ్చ తెలుగు నటులతో సమానంగా వెలుగు వెలిగారు.

అలా విశాల హృదయం కలిగిన సినీ పరిశ్రమగా టాలీవుడ్ విలసిల్లింది. ఇంతటి విశాలత్వం మరే భాషా చిత్ర పరిశ్రమలోనూ చూడలేదని కూడా అంతా చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. అలాంటి టాలీవుడ్ మీద ఇపుడు ఒక మచ్చ పడింది. అది నిందా నిజమా అన్నది పక్కాన పెడితే బహు భాషా నటుడు ప్రకాష్ రాజ్ గట్టిగానే విమర్శ చేశారు. టాలీవుడ్లో ప్రాంతీయ వాదం ఉందని ఆయన ఆరోపించారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా కూడా అది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మచ్చగానే మారింది. ప్రకాష్ రాజ్ జాతీయ నటుడు. ఆన వంటి వారు ఈ మాట అన్నారు అంటే దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది.

నిజానికి టాలీవుడ్ లో పరభాషా నటులకు అవకాశాలు ఎంత ఎక్కువగా ఇస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఒక చిన్న అసోసియేషన్ ఎన్నికల పుణ్యామాని ఆ మంచి పేరు పోయింది దానికి మించి ప్రాంతీయ వాదం తో టాలీవుడ్ కొట్టుమిట్టాడుతోంది అన్న అపనింద పడిపోయింది. ఇది టాలీవుడ్ ప్రగతి విషయంగా చూసుకున్నా మంచి పరిణామం కాదు. నిజానికి మన తెలుగు నటులు కూడా ఇతర భాషలల నటిస్తున్నారు. మంచి పాత్రలు పోషించి వన్నె తెస్తున్నారు.

అందువల్ల ఈ రకమైన ముద్ర కనుక టాలీవుడ్ మీద పడితే అది తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకే చేటుగా మారుతుంది మరో పదేళ్ళలో శత వసంతాల పండుగ జరుపుకునే టాలీవుడ్ కి ఇలాంటి విమర్శలు మంచిది కాదు, ప్రకాష్ రాజ్ ఓటమికి ప్రాంతీయ వాదం అన్నది అనేక కారణాలలో ఒకటి మాత్రమే. పైగా ఆయన కూడా దీన్ని కెలికి పెద్దది చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఇతర భాషల వారి వద్దకు వెళ్ళి వారి కంటే తాను బాగా మాట్లాడగలను అని అంటే వారికి మండకుండా ఉంటుందా.


ప్రకాష్ రాజ్ ఈ విషయంలో తనకు తానుగా కొంత చేసుకున్నారు. ఇక ఆయన్ని నిలబెట్టి మద్దతు ఇచ్చిన వారు సైతం ఇదే రకమైన ఆరోపణలు చేయడం టాలీవుడ్ ప్రగతికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఒక వైపు మన బాహుబలి ఖండాతర కీర్తిని ఆర్జించింది. అలాగ ట్రిపుల్ ఆర్ కూడా రికార్డులు బద్ధలు కొట్టడానికి ఎదురుచూస్తోంది. ఈ రోజు ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారుతున్న వేళ టాలీవుడ్ ఇంకా సంకుచితత్వంతో ఉందని చెప్పడం పూర్తిగా తప్పు, బురద జల్లే వ్యవహారమే. ఎన్నికలు అంటే అనేక అంశాలు ప్రస్థావనకు వస్తాయి. అందులో ఇది కూడా ఒకటి. అంతే తప్ప దానికీ దీనికి ముడిపెడితే టాలీవుడ్ వెలుగులను మసకబార్చే ప్రయత్నం చేయడమే అవుతుందని భావించాలి. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ పోటీ చేయడంతో ఎంతమాత్రం తప్పులేదు. ఆయన మా ప్రెసిడెంట్ అయినా కూడా తప్పు లేదు. అయితే దానికి ముందు సినీ పెద్దలు అనిపించుకున్న్న వారు మిగిలిన పెద్దలతో మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి గట్టిగా కృషి చేసి ఉంటే టాలీవుడ్ లో ఈ రచ్చ తప్పేది, ఈ నింద కూడా లేకుండా పోయేది. ఏది ఏమైనా టాలీవుడ్ కి ఏ భాషా బేధాలు లేవు. అది తొంబై ఏళ్ళ చరిత్రను అడిగితే చెబుతుంది. మరో వందేళ్ళు గడచినా కూడా అది అలాగే కొనసాగుతుంది కూడా.