Begin typing your search above and press return to search.

రూల్స్ పెడతారు కానీ.. ఫాలో అవ్వరు..!

By:  Tupaki Desk   |   23 Sep 2022 3:40 AM GMT
రూల్స్ పెడతారు కానీ.. ఫాలో అవ్వరు..!
X
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం కోసం ఇటీవల ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేసి మరీ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మొత్తానికి వర్తించేలా కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఈ రూల్స్ సక్రమంగా అమలవుతున్నాయా? అంటే.. లేదనే సమాధానాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ప్రొడ్యూసర్స్ వరుస భేటీలు జరిపి కీలక సమస్యలపై కొత్త నిబంధనలు పెట్టారు. ప్రధానంగా ఆర్టిస్టులు టెక్నిషియన్స్ రెమ్యునరేషన్స్ పెరిగిపోవడం - ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.. నిర్మాతలకు కొంత ఊరట కలిగించేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇన్‌ సైడ్ సోర్సెస్ ప్రకారం, కొత్త రూల్స్ కేవలం వార్తల కోసం మాత్రమే అని.. నిర్మాతలు పాత నిబంధనలనే అనుసరిస్తున్నారని తెలుస్తోంది.

కొత్త రూల్స్ ప్రకారం ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ వేరుగా.. ప్రయాణ ఖర్చులు - స్టాఫ్ ఖర్చులు - హోటల్ వసతి - ఫుడ్ సపరేటుగా ఉండవు. ఇకపై అంతా ఆర్టిస్ట్ పారితోషకంలోనే భాగమై ఉంటుంది. అలానే ఏ టెక్నీషియన్ కు కూడా కార్వాన్ ఇవ్వబడదు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించి నిర్మాతకు ఆర్థిక భారం లేకుండా చూడాలని ఇలా అనేక నిబంధనలు తీసుకొచ్చారు.

గతంలో హీరోహీరోయిన్లు మరియు టెక్నిషియన్స్ పర్సనల్ స్టాఫ్ ఖర్చులు - ట్రావెల్ చార్జీలు - హోటల్ బిల్స్ ఇవన్నీ నిర్మాతలే చూసుకోవాల్సి వచ్చేది. మళ్లీ వాళ్ళ రెమ్యునరేషన్ పరేటుగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు రావడంతో భారం తగ్గినట్లే అని అందరూ అనుకున్నారు.

అయితే గిల్డ్ నిర్మాతల కొత్త షూటింగ్ నిబంధనలు సక్రమంగా అమలవడం లేదని తెలుస్తోంది. చాలా మంది నిర్మాతలు ఓన్ కంఫర్ట్‌ లో షూటింగ్స్ చేసుకుంటూ.. ఓల్డ్ రూల్స్ నే ఫాలో అవుతున్నారు. హీరో హీరోయిన్ల అదనపు ఖర్చులు చేసుకోవడమే కాదు.. ఫైట్ మాస్టర్స్ మరియు డ్యాన్స్ మాస్టర్స్ వంటి స్టార్ టెక్నిషియన్స్ కు కూడా కార్వాన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇటీవల ఓ హీరోయిన్ హోటల్ రూమ్ షూట్ ఖర్చు గురించి అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజుకు 20 వేలు ఖర్చయ్యే హోటల్ లో ఉంటోందని.. ఈ బిల్లు నిర్మాత ఖాతాలోనే ఉంటుందని నివేదికలు వచ్చాయి. అలానే కొందరు టాప్ టెక్నిషియన్స్ కార్వాన్ లేకపోతే పనిచేయడానికి ఉత్సాహం చూపించడం లేదని సమాచారం.

సినిమాలు అనుకున్న సమయానికి పూర్తవ్వాలి కాబట్టి.. నిర్మాతలు చేసేదేమీ లేక నటీనటులు - సాంకేతిక నిపుణులు అడిగిన ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా కొత్త రూల్స్ ని తుంగలో తొక్కి వాళ్ల కంఫర్ట్ జోన్ లో నిర్మాతలు ముందుకు వెళ్తే.. ఇంక బడ్జెట్ కంట్రోల్ ఎలా అవుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. సార్లు రూల్స్ పెడతారు కానీ.. ఫాలో అవ్వరు అని సెటైర్లు వేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.