Begin typing your search above and press return to search.

రుద్రుడు మూవీ రివ్యూ : రొడ్డ‌కొట్టుడు రుద్రుడు

By:  Tupaki Desk   |   14 April 2023 8:48 PM IST
రుద్రుడు మూవీ రివ్యూ : రొడ్డ‌కొట్టుడు రుద్రుడు
X
రుద్రుడు మూవీ రివ్యూ
న‌టీన‌టులు: రాఘ‌వ లారెన్స్-ప్రియ భ‌వాని శంక‌ర్-శ‌ర‌త్ కుమార్-నాజ‌ర్-కాళి వెంక‌ట్ త‌దిత‌రులు
సంగీతం: జీవీ ప్ర‌కాష్ కుమార్
నేప‌థ్య సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్.డి.రాజ‌శేఖ‌ర్
క‌థ: తిరుమార‌న్
మాట‌లు: రాజేష్ మూర్తి
నిర్మాణం-ద‌ర్శ‌క‌త్వం: క‌దిరేశ‌న్

న‌టుడిగానే కాక ద‌ర్శ‌కుడిగా మాస్ ప్రేక్ష‌కుల‌కు చేరువ అయ్యాడు ఒక‌ప్ప‌టి డ్యాన్స్ మాస్ట‌ర్ రాఘ‌వ లారెన్స్. ఓవైపు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు తీస్తూనే వేరే చిత్రాల్లో కూడా న‌టించే లారెన్స్.. త‌మిళంలో కదిరేశ‌న్ అనే ద‌ర్శ‌కుడితో చేసిన సినిమా రుద్ర‌న్. ఈ చిత్రం రుద్రుడు పేరుతో తెలుగులో ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాతో లారెన్స్ ఏమేర మెప్పించాడో తెలుసుకుందాం ప‌దండి.

క‌థ:

రుద్ర (రాఘ‌వ లారెన్స్) చ‌దువు పూర్తి చేసి అప్పుడే సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరిన కుర్రాడు. త‌ల్లిదండ్రుల‌తో సంతోషంగా గడుపుతూ తాను ప్రేమించిన అమ్మాయి అన‌న్య (ప్రియ భ‌వాని శంక‌ర్)తో పెళ్లికి సిద్ధ‌మైన స్థితిలో అత‌డి జీవితంలో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది. స్నేహితుడు మోసం చేయ‌డంతో అప్పుల పాలై ఆ బాధ‌లో రుద్ర తండ్రి చ‌నిపోగా.. కుటుంబ బాధ్యత మీద వేసుకుంటాడు రుద్ర‌. ఆ స‌మ‌యంలో అత‌డికి అండ‌గా నిలిచిన అన‌న్య‌.. త‌న‌ను పెళ్లి చేసుకుంటుంది. అప్పులు తీర్చ‌డానికి లండ‌న్ వెళ్లి రుద్ర క‌ష్ట‌ప‌డుతుంటే.. ఇక్క‌డ ఇంట్లో అత‌డి త‌ల్లి చ‌నిపోతుంది. ఆమెను చూసేందుకు వ‌చ్చిన అన‌న్య కనిపించ‌కుండా పోతుంది. మ‌రి రుద్ర త‌ల్లి ఎందుకు చ‌నిపోయింది.. అనన్య ఏమైంది.. ఈ స్థితిలో రుద్ర ఏం చేశాడు.. అన్న‌ది మిగ‌తా క‌థ‌.

క‌థ‌నం-విశ్లేష‌ణ:

రాఘ‌వ లారెన్స్ అంటే ఊర‌ మాస్ మ‌సాలా సినిమాల‌కు పెట్టింది పేరు. అత‌ను సొంతంగా తీసే హార్ర‌ర్ కామెడీ సినిమాలైనా కాస్త న‌యం కానీ.. హీరోగా న‌టించే సినిమాలు మ‌రీ రొటీన్ గా అనిపిస్తాయి. రుద్రుడు ట్రైల‌ర్ చూసి.. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా ఏంటి అనుకున్నారు చాలామంది. లారెన్స్ టేస్టు మీద అంచ‌నా ఉండి.. రుద్రుడు ట్రైల‌ర్ చూసి.. ఒక రొటీన్ మాస్ మ‌సాలా సినిమా చూడ‌బోతున్నాం.. అని ప్రిపేరై థియేట‌ర్లోకి అడుగు పెట్టినా కూడా కాసేప‌టికే త‌ల బొప్పి క‌ట్ట‌డం ఖాయం. ఇక్క‌డ‌ మాస్ సినిమాలంటే ప‌నికి రానివ‌ని తీసిప‌డేయ‌డం కాదు. ఎంత క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్లో సాగిపోయే సినిమాలైనా స‌రే.. క‌థ‌లో కాస్త‌యినా విష‌యం ఉండాలి. స‌న్నివేశాల్లో ర‌వ్వంతైనా కొత్త‌ద‌నం క‌నిపించాలి. న‌రేష‌న్ కొంచెమైనా ఎంగేజింగ్ గా అనిపించాలి. కానీ రుద్రుడులో ఈ ల‌క్ష‌ణాలు ఏవీ క‌నిపించ‌వు. మాస్ మాస్ అనుకుంటూ లారెన్స్ చేసిన వీరంగమంతా చూసి త‌ల‌పోటు రాకుండా బ‌య‌టికి రావ‌డం చాలా క‌ష్టం.

నేనింతే సినిమాలో ద‌ర్శ‌కుడి పాత్ర‌లో బ్ర‌హ్మానందం ''ప‌బ్లిక్ వాంట్స్ ద‌ట్ అతి'' అని ఒక డైలాగ్ చెబుతాడు. రుద్రుడు సినిమా టీం అంతా క‌లిసి కూర్చుని ఈ సినిమా ఎలా తీయాలో చ‌ర్చించుకుంటూ స‌రిగ్గా ఈ మాటే అనుకున్నారేమో తెలియ‌దు కానీ.. ఇందులో ప్ర‌తిదీ అతికే అతిలా అనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే హీరో త‌న ప్ర‌తీకారంలో భాగంగా ఒక సీన్లో 50 మందికి పైగా రౌడీల‌ను న‌రికి పోగులు పెట్టి ఒక కుప్ప‌లా పోస్తాడు. హీరో చేతిలో చ‌చ్చిన త‌న మ‌నిషిని చూసేందుకు వ‌చ్చిన విల‌న్.. శవం మీద వేసిన దండ‌లు తీసి ప‌డేసి.. ఐస్ బాక్స్ కూడా ధ్వంసం చేసి.. శ‌వం బ‌ట్ట‌లు కూడా ఊడ‌బీకి ఒంటి మీద ఎన్ని క‌త్తి పోట్లు ఉన్నాయో చూస్తాడు. హీరో వీర‌త్వం.. విల‌న్ క్రూర‌త్వం ఎలాంటిదో చూపించ‌డానికి ఇలాంటి సీన్లు పెట్ట‌డం ఒకెత్త‌యితే.. రొమాంటిక్.. సెంటిమెంట్ సీన్ల‌లో సైతం ఇంతే అతి చూపించ‌డం ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత క‌దిరేశ‌న్ కే చెల్లింది. హీరో త‌ల్లి చ‌నిపోయాక లండ‌న్లో ఉన్న హీరో విష‌యం తెలుసుకున్న ద‌గ్గ‌ర్నుంచి.. త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యే వ‌ర‌కు న‌డిచే సెంటిమెంటు ధార గురించి ఏమ‌ని చెప్పాలి? టైం మెషీన్ ఎక్కి ఒకేసారి 30-40 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయిన‌ట్లు అనిపిస్తుంది ఈ సీన్లు చూస్తుంటే. ఈ రోజుల్లో ఇంత మెలోడ్రామాతో స‌న్నివేశాలు తీసి మెప్పించ‌గ‌లం అన్న కాన్ఫిడెన్సుకి దండం పెట్టాల్సిందే.

క‌థ‌గా చూసుకుంటే ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అయిన రుద్రుడులో పాజిటివ్ అని చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. యాక్ష‌న్.. కామెడీ.. సెంటిమెంట్.. రొమాన్స్.. ఇలా సినిమాలో అన్ని ర‌సాలూ ద‌ట్టించారు కానీ.. అన్నీ కూడా ఓవ‌ర్ డోసే. ఆరంభ స‌న్నివేశం ద‌గ్గ‌ర్నుంచి ఔట్ డేటెడ్ ఫీల్ గుప్పుమ‌ని కొడుతుంటుంది. హీరో ఇంట్రోనే ఒక భారీ ఫైట్ తో మొద‌లైతే.. అందులో ర‌క్త‌పాతం చూస్తే ఎంత యాక్ష‌న్ ప్రియుల‌కైనా కూడా ఢోకు వ‌చ్చేస్తుంది. రొమాంటిక్ సీన్లు.. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు సైతం భ‌రించ‌లేని అతితో.. సాగ‌తీత‌తో న‌డిచి ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. దృశ్యాలు పెట్టే బాధ చాల‌ద‌ని.. విప‌రీత‌మైన శ‌బ్దాల‌తో సాగే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల త‌ల‌పోటును పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. మాస్ సినిమాలంటే ప‌డిచ‌చ్చే వారు సైతం చివ‌రి వ‌ర‌కు కూర్చోలేని స్థాయిలో టార్చ‌ర్ పెట్టే రుద్రుడుని మిగ‌తా ఆడియ‌న్స్ అయితే అర‌గంట కూడా త‌ట్టుకోలేరు.

న‌టీన‌టులు:

రాఘ‌వ లారెన్స్ న‌ట‌న మామూలుగానే అతిగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో అయితే అతిలో ప‌తాక స్థాయిని అందుకున్నాడు. న‌ట‌న‌కు సంబంధించి శిక్ష‌ణ తీసుకునే వాళ్ల‌కు 'ఓవ‌రాక్ష‌న్' అనే పాఠం చెప్ప‌డానికి ఈ సినిమాలో లారెన్స్ యాక్టింగ్ ను రెఫరెన్సుగా తీసుకోవ‌చ్చు. ముఖ్యంగా సెంటిమెంటు సీన్ల‌లో లారెన్స్ అతి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సినిమాలో కాస్త చూడ‌ద‌గ్గ‌గా అనిపించేది ఒక్క ప్రియ భ‌వాని శంక‌ర్ మాత్ర‌మే. లారెన్స్ ప‌క్క‌న ఆమెకు జోడీ కుద‌ర‌క‌పోయినా.. త‌న వ‌ర‌కు అందం.. అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. శ‌ర‌త్ కుమార్ విల‌నీలో ఏ ప్ర‌త్యేక‌తా లేదు. నాజ‌ర్ చాలా మామూలు పాత్ర చేశాడు. మంచి న‌టుడైన కాళి వెంక‌ట్ కూడా ఇందులో మెప్పించ‌లేక‌పోయాడు.

సాంకేతిక వ‌ర్గం:

రుద్రుడు సినిమాకు జీవీ ప్ర‌కాష్ కుమార్ పాట‌లు అందించాడంటే న‌మ్మ‌బుద్ధి కాదు. క్లాస్ ట‌చ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చే అత‌ను.. ఈ సినిమాకు ఎలాంటి పాట‌లు ఇవ్వాలో తెలియ‌ని అయోమ‌యంలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాయించేసిన‌ట్లున్నాడు. సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్ష‌కుల చెవులు చిల్లులు ప‌డేలా చేస్తుంది. మాస్ పేరు చెప్పి అత‌ను శ‌బ్ద కాలుష్యంతో నింపేశాడు. తిరుమార‌న్ క‌థ గురించి చెప్ప‌డానికి ఏమీ లేదు. ద‌ర్శ‌క నిర్మాత క‌దిరేశ‌న్ కొన్ని ద‌శాబ్దాల వెనుక ద‌ర్శ‌కుడు కావాల్సిన వాడు. అంత ఔట్ డేటెడ్ గా సాగింది అత‌డి న‌రేష‌న్.

చివ‌ర‌గా: రొడ్డ‌కొట్టుడు రుద్రుడు

రేటింగ్-1/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater