Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : రుద్రంగి

By:  Tupaki Desk   |   7 July 2023 7:53 PM
మూవీ రివ్యూ : రుద్రంగి
X
'రుద్రంగి' మూవీ రివ్యూ

నటీనటులు: జగపతిబాబు-మమతా మోహన్ దాస్-విమలా రామన్-ఆశిష్ గాంధీ-గానవి లక్ష్మణ్-ఆర్.ఎస్.నంద్య-కాలకేయ ప్రభాకర్-దివి వడిత్యా-చరిష్మా శ్రీకర్ తదితరులు

సంగీతం: నాఫెల్ రాజా

ఛాయాగ్రహణం: సంతోష్ శానమొని

నిర్మాత: రసమయి బాలకిషన్

రచన-దర్శకత్వం: అజయ్ సామ్రాట్

ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు ఇప్పుడు విలన్.. క్యారెక్టర్ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన భయంకరమైన విలన్ పాత్ర పోషించిన కొత్త చిత్రం 'రుద్రంగి'. తెలంగాణ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు జగపతిబాబు పాత్రే ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. టీజర్.. ట్రైలర్లతో క్యూరియాసిటీ పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

1945లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత కూడా దొరల పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో రుద్రంగి అనే సంస్థానాన్ని భీం రావ్ దేశ్ ముఖ్ (జగపతిబాబు) ఏలుతుంటాడు. భూషణ్ రావు (కాలకేయ ప్రభాకర్) అనే మరో దొర కారణంగా తన తాతయ్యను కోల్పోయి.. చిన్నతనంలోనే తాను పెళ్లి చేసుకున్న మరదలు రుద్రంగి (గానవి లక్ష్మణ్)ను దూరం చేసుకుని.. ఆ దొర శత్రువైన భీం రావ్ దగ్గర పాలేరుగా చేరతాడు మల్లేష్ (ఆశిష్ గాంధీ). చిన్నవాడిగా ఉండగానే భీమ్ రావు ప్రాణాలు కాపాడిన మల్లేష్.. పెరిగి పెద్దయ్యాక తమ ఉమ్మడి శత్రువు అయిన భూషణ్ రావును చంపేస్తాడు. దీంతో దొరకు మరింత చేరువ అవుతాడు. కానీ దొర రెండో భార్య అయిన జ్వాలాముఖి మల్లేష్ మీద మనసు పడితే.. మల్లేష్ భార్య అయిన రుద్రంగి మీద దొర కన్నేస్తాడు. దీంతో దొరకు మల్లేష్ కు మధ్య వైరం మొదలవుతుంది. మరి ఈ పోరు ఎక్కడిదాకా వెళ్లిందన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

తెలంగాణను ఏలిన దొర‌ల అరాచ‌కాలు.. అఘాయిత్యాల గురించి క‌థ‌లు క‌థ‌లుగా విన్నాం. ఒసేయ్ రాముల‌మ్మ‌.. స‌మ్మ‌క్క సార‌క్క.. రాజ‌న్న‌ స‌హా ఎన్నో సినిమాలు చూశాం. కొన్నేళ్ల ముందు దొర‌సాని పేరుతో ఈ నేప‌థ్యంలో ఈ త‌రం ప్రేక్ష‌కుల కోసం ఒక ఇంటెన్స్ ల‌వ్ స్టోరీ కూడా తీశారు. ఐతే ఇప్పుడు తెలంగాణ మ‌ట్టి క‌థ‌లకు మంచి డిమాండ్ నెల‌కొన్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌ను ఏడు ద‌శాబ్దాలు వెన‌క్కి తీసుకెళ్లి ఓ క‌థ‌ను చెప్పాల‌ని చూసింది రుద్రంగి టీం. ఐతే ప‌ర‌మ దుర్మార్గుడైన దొర‌.. అత‌డి అరాచ‌కాలు.. ఆ దొర ద‌గ్గ‌ర కాల్మొక్తా బాంచ‌న్ అనే అమాయ‌క ప్ర‌జ‌లు.. వారి బాధ‌లు అంటూ ఎప్పుడూ వినే.. ఎన్నో సార్లు చూసిన విష‌యాల‌నే ఇందులోనూ చూపించారే త‌ప్ప‌.. క‌థ ప‌రంగా ఏ కొత్త‌ద‌నం లేదు. ట్రైల‌ర్ చూస్తే సంథింగ్ స్పెష‌ల్ గా అనిపించినా.. సినిమాలో అలాంటిదేమీ లేక స‌గ‌టు సెంటిమెంట్ డ్రామా క‌నిపించ‌డంతో ప్రేక్ష‌కుల‌కు తీవ్ర నిరాశ త‌ప్ప‌దు. పూర్తిగా తెలంగాణ నేటివిటీతో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి వారికైనా ఈ సినిమా క‌నెక్ట్ అవుతుందా అన్న‌ది సందేహం.

రుద్రంగి సినిమాకు సంబంధించి అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించింది జ‌గ‌ప‌తిబాబు చేసిన భీమ్ రావ్ దేశ్ ముఖ్ పాత్రే. త‌న‌కు రొటీన్ సూటూ బూటేసుకునే రిచ్ విల‌న్ పాత్ర‌లే ఇస్తున్నార‌ని.. వైవిధ్య‌మైన పాత్ర‌లు ఇస్తే చిన్న సినిమాలైనా.. పెద్ద‌గా పారితోష‌కం లేక‌పోయినా చేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన జ‌గ‌ప‌తిబాబుకు భీమ్ రావ్ క‌చ్చితంగా కొత్త అనుభ‌వాన్ని ఇచ్చే ఉంటుంది. ఆయ‌న కూడా ఇంటెన్స్ యాక్టింగ్ తో ఈ పాత్ర‌ను పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సినిమాలో క‌థ‌ను ఎంతో కొంత డ్రైవ్ చేసేది.. ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేసేది ఈ పాత్రే. జ‌గ‌ప‌తి క‌నిపించిన‌పుడ‌ల్లా ఆడియ‌న్స్ కొంచెం అలెర్ట్ అయ్యేలా ఆ పాత్ర‌ను డిజైన్ చేశారు. అలా అని ఆ పాత్ర కూడా పూర్తిగా ఎంగేజ్ చేయ‌దు. త‌న కంటికి ఇంపుగా అనిపించిన ప్ర‌తి అమ్మాయినీ అనుభ‌వించాల‌నుకునే ప‌రమ దుర్మార్గుడైన ఆ పాత్ర‌లో మ‌రీ కొత్త‌ద‌నం అయితే క‌నిపించ‌దు. ఆ పాత్ర క‌నిపించిన‌పుడ‌ల్లా బ్యాగ్రౌండ్లో విచిత్ర‌మైన శ‌బ్దాలు చేయించ‌డం.. అలాగే త‌న గెట‌ప్ కొంచెం చిత్రంగా ఉండ‌టం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ జ‌గ‌ప‌తిబాబే లేకుంటే.. డెడ్ స్లోగా సాగే సినిమాను భ‌రించ‌డం చాలా క‌ష్టం అయ్యేది.

అవ‌త‌ల జ‌గ‌ప‌తిబాబు ఉన్న‌పుడు.. హీరోగా ఆయ‌న్ని ఢీకొట్టే బ‌ల‌మైన‌ హీరో ఉంటే ఫైట్ ర‌క్తి క‌ట్టేది. కానీ మ‌న ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని.. స‌రైన హావ‌భావాలు కూడా ఇవ్వ‌లేని ఆశిష్ గాంధీని మ‌ల్లేష్ పాత్ర‌కు తీసుకున్నారు. అత‌డి పాత్ర‌.. అలాగే న‌ట‌న నీర‌సం తెప్పించేస్తుంది. ఏ ద‌శ‌లోనూ ఆ పాత్ర‌లో క‌నెక్ట్ కాలేక‌పోవ‌డం సినిమాలో అతి పెద్ద ప్ర‌తికూల‌త‌. త‌న తాత‌ను చంపి త‌న జీవితాన్ని త‌ల్ల‌కిందులు చేసిన దొర‌మీద హీరో ప్ర‌తీకారం తీర్చుకునే ఎపిసోడ్ ను రోమాంచితంగా తీసే అవ‌కాశం ఉన్నా.. దాన్ని ద‌ర్శ‌కుడు స‌రిగా ఉప‌యోగించుకోలేదు.. ఇక తాను దేవుడిలా కొలిచే దొర‌.. త‌న భార్య‌నే కోరుకోవ‌డంతో ఆయ‌న మీద‌ ఎదురు తిర‌గాల్సిన ప‌రిస్థితి త‌లెత్తే ఎపిసోడ్ కూడా చాలా సాధార‌ణంగా అనిపిస్తుంది. రుద్రంగి పాత్ర‌లో చేసిన అమ్మాయి బాగున్నా.. ద్వితీయార్ధం అంతా ఆ పాత్ర చుట్టూ ఓవ‌ర్ సెంటిమెంటును పండించే ప్ర‌య‌త్నంలో సినిమా న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. చెప్పుకోద‌గ్గ మ‌లుపులేమీ లేకుండా విప‌రీత‌మైన మెలోడ్రామాతో న‌డినిన ద్వితీయార్ధం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. దొర కోరిక వ‌ల్ల ఊరి జ‌నాలు గుక్కెడు నీళ్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితికి చేర‌డం.. చివ‌రికి త‌నను దొర‌కు అర్పించ‌డానికి రుద్రంగి సిద్ధం కావ‌డం.. ఈ క్ర‌మం మ‌రీ సాగ‌తీత‌గా అనిపిస్తుంది. ముగింపులోనూ మెరుపుల్లేని ఈ సినిమా.. ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి భిన్న‌మైన అనుభూతిని క‌లిగించ‌దు.


నటీనటులు:

జగపతిబాబు చేసింది హీరో పాత్ర కాదు కానీ.. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. తన పాత్రలు మరీ బోర్ కొట్టేస్తున్నాయని ఫీలయ్యే జగపతికి భీమ్ రావు పాత్ర ఆకలి తీర్చేదే. కొన్ని చోట్ల జ‌గ‌ప‌తి హావ‌భావాలు.. న‌ట‌న హ‌ద్దులు దాటిన‌ట్లు అనిపించినా.. ఆయ‌నకిది గుర్తుంచుకోద‌గ్గ పాత్రే. ఆశిష్ గాంధీ.. జ‌గ‌ప‌తి ముందు తేలిపోయాడు. చాలా చోట్ల అత‌ను ఉత్స‌వ విగ్ర‌హంలా నిల‌బ‌డ్డాడు. రుద్రంగిగా చేసిన క‌న్న‌డ న‌టి గాన‌వి ల‌క్ష్మ‌ణ్ చూడ్డానికి బాగుంది. త‌న న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. మ‌మతా మోహ‌న్ దాస్ పాత్ర ఆస‌క్తి రేకెత్తిస్తుంది కానీ.. ఒక ద‌శ దాటాక‌ ఆమె పాత్ర సైడ్ అయిపోతుంది. విమ‌లా రామ‌న్ బాగా చేసింది. హీరో తాత పాత్ర‌లో చేసిన న‌టుడు మెప్పించాడు. క‌ర‌ణం పాత్ర చేసిన యాక్ట‌ర్ కూడా ఆక‌ట్టుకున్నాడు. కాల‌కేయ ప్ర‌భాక‌ర్ క్యామియో త‌ర‌హా పాత్ర‌లో త‌న‌దైన ముద్ర వేశాడు.


సాంకేతిక వర్గం:

టెక్నిక‌ల్ గా రుద్రంగి ప‌ర్వాలేద‌నిపిస్తుంది. నాఫెల్ రాజా పాట‌లు.. నేప‌థ్య సంగీతం ఓ మోస్త‌రుగా సాగిపోయాయి. సంతోష్ శానమొని ఛాయాగ్ర‌హ‌ణం ఆక‌ట్టుకుంటుంది. సినిమాకు అత‌ను ఒక రిచ్ లుక్ తీసుకొచ్చాడు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ప‌ర్వాలేదు. ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఈ సినిమా మార్కెట్ స్థాయికి మించే ఖ‌ర్చు పెట్టాడు. ఆయ‌న ఒక పాట‌లో కూడా మెరిశాడు. ద‌ర్శ‌కుడు అజ‌య్ సామ్రాట్ ఏడు ద‌శాబ్దాల కింద‌ట దొర‌ల పాల‌న‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్ట‌డానికి క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ క‌థాక‌థ‌నాల్లో కొత్త‌ద‌నం మాత్రం చూపించ‌లేక‌పోయాడు. డ్రామాను ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌లేక‌పోయాడు. ఓవ‌ర్ డోస్ సెంటిమెంటు మీద ఆధార‌ప‌డ్డ అత‌ను ఈ త‌రం ప్రేక్ష‌కులు మెచ్చేలా సినిమాను తీర్చిదిద్ద‌లేకపోయాడు.

చివరగా: పాత సీసాలో పాత సారా

రేటింగ్: 2.25/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater