Begin typing your search above and press return to search.

ఎంత పని చేశావ్ రుద్రమదేవీ..

By:  Tupaki Desk   |   22 Aug 2015 9:55 AM GMT
ఎంత పని చేశావ్ రుద్రమదేవీ..
X
కన్ఫమ్.. రుద్రమదేవి సెప్టెంబరు 4న రావట్లేదు. సినిమా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో సైతం సెప్టెంబరు 4న విడుదల అంటూ చేసిన ట్వీట్లు, రిలీజ్ డే పోస్టర్లు అన్నీ తీసేశారు. ఒక్కోసారి గుణశేఖర్ ను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంకోసారి అతణ్ని చూసి కోపం కూడా వస్తుంది. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు అన్న మాట గుర్తుకొస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమా కోసం అతనెంత కష్టపడ్డాడో.. ఎంత పెద్ద రిస్కులు చేశాడో సామాన్య ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. అందుకే ఆ సినిమా బాగా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. గుణశేఖర్ తన సినిమాను విడుదల చేయాలనుకున్నపుడల్లా ఇండస్ట్రీ జనాలు కూడా బాగానే సహకరిస్తున్నారు. ముందు వారం, తర్వాతి వారం పెద్ద సినిమాలేవీ లేకుండా చూస్తున్నారు. కానీ గుణశేఖర్ సద్వినియోగం చేసుకుంటేనా? సెప్టెంబరు 4న విడుదల తేదీ ప్రకటించడంతో దానికి తగ్గట్లుగా మిగతా సినిమాలు షెడ్యూల్ చేసుకున్నారు.

కానీ ఎప్పట్లాగే ‘రుద్రమదేవి’ని మరోసారి వాయిదా వేసేశాడు గుణ. దీంతో షెడ్యూల్స్ అన్నీ మార్చుకోవాల్సి వస్తోంది. రుద్రమదేవి ఇచ్చిన ఖాళీలోకి రెండు మూడు సినిమాలు వచ్చి దూరిపోవడానికి చూస్తున్నాయి. సెప్టెంబరు 4న భలే భలే మగాడివోయ్ ముందుగా స్లాట్ బుక్ చేసుకుంది. అక్టోబరు 1న తెద్దామనుకుంటున్న ‘డైనమైట్’ను కూడా ఈ రోజే విడుదల చేయాలని చూస్తున్నాడు మంచు విష్ణు. మరోవైపు తేజ కూడా తన ‘హోరాహోరీ’ సినిమాను ఇదే రోజు విడుదల చేయబోతున్నాడట. రుద్రమదేవి ఇచ్చిన ఖాళీని వీళ్లు సద్వినియోగం చేసుకున్నారు సరే.. ఆ సినిమా ఎప్పుడొస్తుందన్ని సందేహం. ప్రస్తుతానికైతే సెప్టెంబరు 18న అంటున్నారు. ఐతే తర్వాతి వారం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి క్రేజ్ ఉన్న మూవీ ఉంది. సెప్టెంబరు 18న రావడానికి కూడా కొన్ని సినిమాలు ప్రణాళికల్లో ఉన్నాయి. దీని వల్ల ఆ సినిమాలకూ కష్టమే. రుద్రమదేవికీ కష్టమే. ఐతే ఇప్పటికి అయ్యిందేదో అయ్యింది. ఈసారైనా గుణశేఖర్ పక్కాగా అన్నీ ప్లాన్ చేసుకుని రిలీజ్ డేట్ ఇచ్చి.. ఆ డేటుకే సినిమాను విడుదల చేస్తే బెటర్.