Begin typing your search above and press return to search.

రుద్రమదేవి.. సరికొత్త అనుభవం

By:  Tupaki Desk   |   15 July 2015 6:30 AM GMT
రుద్రమదేవి.. సరికొత్త అనుభవం
X
త్రీడీ సినిమా అనగానే అది చూడ్డానికి ఉపయోగించే ప్రత్యేకమైన కళ్లద్దాలు గుర్తుకొస్తాయి. ఆ కళ్లద్దాలు పెట్టుకుని సినిమా చూడ్డం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. త్రీడీ అనుభవం బాగానే ఉంటుంది కానీ.. ఆ కళ్లద్దాలు కొంచెం స్ట్రెయిన్‌గా అనిపిస్తాయన్న మాట వాస్తవం. పైగా ప్రతి థియేటర్‌కూ త్రీడీ కళ్లద్దాలు సమకూర్చడం కూడా పెద్ద సమస్య. ఐతే ఆ కళ్లద్దాలు లేకుండానే త్రీడీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికే హాలీవుడ్‌లో ఈ సౌలభ్యం ఉంది. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించడానికి సన్నాహాలు చేశాడు దర్శకుడు గుణశేఖర్. ఆయన కలల చిత్రం ‘రుద్రమదేవి’ త్రీడీలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే అందరికీ త్రీడీలో సినిమా చూసే అవకాశం దక్కదని భావించి.. ఎన్హాన్స్డ్ డెప్త్ సొల్యూషన్ (ఈడీఎస్) అనే సరికొత్త టెక్నాలజీ ద్వారా ప్రతి ప్రేక్షకుడూ త్రీడీ అనుభవాన్ని పొందే సౌలభ్యం కల్పిస్తున్నాడు గుణ.

అమెరికాకు చెందిన ఇంగ గ్రూప్ సంస్థ కళ్లద్దాలు లేకుండా త్రీడీ సినిమా చూసిన అనుభవాన్ని కల్పించే ఈడీఎస్ టెక్నాలజీని అందిస్తోంది. ఇంతకుముందు కుంగ్‌ఫూ పాండా, ఇన్సెప్షన్, అవతార్ లాంటి సినిమాలకు ఈ సంస్థే ఆ టెక్నాలజీని అందించింది. ఇప్పుడు రుద్రమదేవి సినిమాకు కూడా ఆ సంస్థతోనే పని చేయించుకున్నాడు గుణశేఖర్. దీని కోసం భారీగానే ఖర్చయినట్లు సమాచారం. రుద్రమదేవిని త్రీడీ, టూడీ రెండు విధానాల్లోనూ తెరకెక్కించారు. ఐతే త్రీడీలో సినిమా ప్రదర్శించే అవకాశమున్నట్లు అలాగే చూపించి.. టూడీ వెర్షన్‌కు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఐతే ఈ పని ఇప్పుడు మొదలైంది కాదు. ఎనిమిది నెలల కిందట్నుంచే ఈ వర్క్ జరుగుతోందట. ఆగస్టులో ‘రుద్రమదేవి’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.