Begin typing your search above and press return to search.

సెన్సారైపోయింది.. సినిమా సూపరట

By:  Tupaki Desk   |   22 Sept 2015 1:06 PM IST
సెన్సారైపోయింది.. సినిమా సూపరట
X
సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అక్టోబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ‘రుద్రమదేవి’ విడుదల అని గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ జనాల్లో ఇంకా సందేహాలు లేకపోలేదు. ఇంతకుముందు రిలీజ్ డేట్ కు బాగా దగ్గరవుతుండగా గుణ వాయిదా ప్రకటన చేశాడు కాబట్టి కొంచెం డౌట్ తోనే ఉన్నారు. కానీ ఆ సందేహాలు పటాపంచలు చేయడానికేనా అన్నట్లు విడుదల తేదీకి దాదాపు 20 రోజులుండగానే సెన్సార్ కానిచ్చేశాడు గుణశేఖర్.

‘రుద్రమదేవి’ సెన్సార్ పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేశారు సెన్సారోళ్లు. ఇక ప్రమోషన్స్ తో మోతెక్కించడమే మిగిలి ఉంది. రూ.70 కోట్ల బడ్జెట్ కాబట్టి.. కొంచెం గట్టిగానే చేయాల్సి ఉంటుంది ప్రమోషన్స్. రుద్రమదేవిపై ఇంతకుముందు జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఇప్పుడు మళ్లీ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచాల్సి ఉంది.

ఐతే ‘రుద్రమదేవి’ సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సినిమా సూపరట. చాలా మంచి రిపోర్ట్ ఉందంటూ నిర్మాత - పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. ఇంకొంతమంది కూడా సెన్సార్ రిపోర్ట్ బావుందని అంటున్నారు. ఇది గుణశేఖర్ కు ఉత్సాహాన్నిచ్చే విషయమే. విడుదలకు ముందు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేద్దామని యోచిస్తున్నాడట గుణ. అందరితో సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడిస్తే ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాడట.