Begin typing your search above and press return to search.

రుద్రమపై సింపతీ.. బ్రూస్ లీకి శాపం

By:  Tupaki Desk   |   29 Oct 2015 11:00 PM IST
రుద్రమపై సింపతీ.. బ్రూస్ లీకి శాపం
X
కొన్నిసార్లు అంతే.. తప్పేమీ లేకున్నా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ‘బ్రూస్ లీ’ టీమ్ అలాంటి శిక్షే అనుభవించింది. నిజానికి బ్రూస్ లీ కంటెంట్ ప్రకారం చూస్తే దానికి మరీ ఇంత నెగెటివ్ టాక్ వస్తుందని.. ఇంత పెద్ద ఫ్లాప్ అవుతుందని.. జనాలు మరీ అంతగా సినిమాను పక్కన పెట్టేస్తారని మొదట్లో ఎవ్వరూ అనుకోలేదు. కానీ సినిమాకు ఆరంభంలో వచ్చిన టాక్ కంటే కూడా ఎక్కువగా నెగెటివ్ ప్రచారం జరిగింది సినిమా గురించి. జనాలు ఓ రకమైన కోపం చూపించారు ఈ సినిమా మీద. దీనికి కారణం ‘రుద్రమదేవి’యే అనడంలో సందేహం లేదు.

ఓ చారిత్రక కథతో ఎంతో సాహసంగా రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసిన గుణశేఖర్ పై జనాలకు ముందు నుంచి సింపతీ ఉంది. సినిమా పదే పదే వాయిదా పడటంతో అతడి మీద సింపతీ మరింత పెరిగింది. మీడియాలో కూడా గుణశేఖర్ ఏమవుతాడో అన్న వార్తలతో అంతకంతకూ అతడి మీద జాలి పడ్డారు జనాలు. సినిమాను విడుదల చేయడంలో అతడు పడ్డ ఇబ్బందులు కూడా జనాల్లో అతడి మీద సింపతీ పెరిగేలా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘రుద్రమదేవి’ని రక్షించడానికి ‘బ్రూస్ లీ’ టీం సహకరించలేదనే ఫీలింగ్ జనాల్లో పడింది. ‘బ్రూస్ లీ’ వాయిదా వేస్తే గుణశేఖర్ బతుకుతాడన్న అభిప్రాయం బలపడింది. ఐతే సినిమా మొదలుపెట్టినపుడే రిలీజ్ డేట్ ఇచ్చాం కాబట్టి తమ తప్పేమీ లేదని రిలీజ్ కు రెడీ అయిపోయింది ‘బ్రూస్ లీ’ టీమ్. దీంతో ‘రుద్రమదేవి’ విషయంలో జనాల్లో ఉన్న సింపతీ.. ‘బ్రూస్ లీ’ టీం మీద కోపంగా మారింది. దీంతో సినిమాకు డివైడ్ టాక్ రావడంతో అందరూ ఆ సినిమాను ఆడేసుకున్నారు. డివైడ్ టాక్ కాస్తా నెగెటివ్ టాక్ గా మారిపోయింది. ‘రుద్రమదేవి’కి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ దక్కింది. ‘బ్రూస్ లీ’ పెద్ద ఫ్లాపైంది.