Begin typing your search above and press return to search.

#RRR పై మ‌రో పుకార్.. ఇదైనా నిజ‌మా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 5:14 AM GMT
#RRR పై మ‌రో పుకార్.. ఇదైనా నిజ‌మా?
X
భారీ సినిమాలు రిలీజ్ ల‌కు వ‌స్తున్నాయి అంటే వాటిపై ర‌క‌ర‌కాల పుకార్లు షికారు చేస్తుంటాయి. ముఖ్యంగా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఉండ‌గా రిలీజ్ తేదీకి సంబంధించిన డైల‌మా క‌నిపిస్తుంది. భారీ బ‌డ్జెట్లు వెచ్చించి భారీ తారాగ‌ణంతో సినిమా చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి అదేమీ ఆషామాషీ వ్య‌వ‌హారం కానేకాదు. పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యినా విజువ‌ల్ గ్రాఫిక్స్.. ఎఫెక్ట్స్.. డీఐ.. డ‌బ్బింగ్.. ప‌బ్లిసిటీ అంటూ చాలా ప‌నులే ఉంటాయి. వీట‌న్నిటిలోనూ ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. అన్నిటినీ అధిగ‌మిస్తూనే షూటింగును పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నుల్ని చేయాల్సి ఉంటుంది.

ఈ త‌ర‌హా స‌వాళ్ల‌ను ఇంత‌కుముందు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. స‌మ‌స్య ఎదురైన ప్ర‌తిసారీ సొల్యూష‌న్ వెతికి స‌త్తా చాటారు. అలా చేయ‌గ‌లిగారు కాబ‌ట్టే బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 చిత్రాల్ని స‌వ్యంగా రిలీజ్ చేయ‌గ‌లిగారు. అంత‌కుమించి స‌క్సెస్ చేయ‌గ‌లిగారు. అప్ప‌ట్లో బాహుబ‌లి సిరీస్ సినిమాల్ని కూడా చెప్పిన స‌మ‌యానికి రిలీజ్ చేయ‌ని మాట వాస్త‌వం. కానీ తాను అనుకున్న ఔట్ పుట్ తో రిలీజ్ చేయ‌డంలో మాత్రం రాజ‌మౌళి ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అందుకే ఈసారి కూడా ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తాను అనుకున్న రీతిలో పూర్తి చేసి స‌వ్య‌మైన విధానంలోనే రిలీజ్ చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. ఈ విష‌యంలో అభిమానులు స‌హా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు సైతం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్ర‌తిసారీ ఆర్.ఆర్.ఆర్ వాయిదా అంటూ ఓ ప్ర‌చారం మాత్రం తెర‌పైకి వ‌స్తోంది. ఈ భారీ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేస్తున్నామ‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. అయితే ఆరంభం నుంచి ర‌క‌రకాల కార‌ణాల‌తో షూటింగ్ వాయిదా ప‌డ‌డం టీమ్ విశ్వాసాన్ని దెబ్బ కొట్టింది. అయినా మొండిగా రాజ‌మౌళి ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి ముందే ప్ర‌క‌టించిన తేదీకే రిలీజ్ చేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నారు. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు కాబ‌ట్టి జూలైలో రిలీజ్ సాఫీగానే సాగుతుంద‌నే అభిమానులు భావిస్తున్నారు. అయితే జూలైలో రిలీజ‌వుతుందా? అంటూ ఇప్ప‌టికే ఎన్నో వంద‌ల క‌థ‌నాలు తెలుగు మీడియాలో వ‌చ్చాయి. జూలై నాటికి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చేయ‌డ‌మే పూర్తి కాదు కాబ‌ట్టి ద‌స‌రాకి వాయిదా వేసారు అని కూడా ప్ర‌చార‌మైంది. అయితే దేనినీ రాజ‌మౌళి అండ్ టీమ్ క‌న్ఫామ్ చేయ‌లేదు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి బ‌రికి షిఫ్ట్ అయ్యింద‌న్న మ‌రో పుకార్ షికార్ చేస్తోంది. స‌మ్మ‌ర్ లేదు ద‌స‌రా లేదు.. నేరుగా 2021 సంక్రాంతికే వాయిదా ప‌డింద‌ని.. ఇంత భారీ చిత్రానికి పెద్ద పండ‌గే క‌రెక్ట్ అన్న ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. ఇక ద‌స‌రా కంటే సంక్రాంతి అయితేనే సేఫ్ అన్న విశ్లేష‌ణ చేస్తుండ‌డం విడ్డూర‌మే.

ఇకపోతే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పార్ట్ పై పూర్తి క్లారిటీ ఇప్ప‌టి వ‌ర‌కూ రాక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ క‌న్ఫ్యూజ‌న్ అంతా. బ్యాలెన్స్ 20 శాతం షూటింగ్ పూర్త‌యిపోతే రాజ‌మౌళికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. వీఎఫ్ ఎక్స్ - గ్రాఫిక్స్ పై ఫోక‌స్ చేశాక వంద శాతం క్లారిటీకి వ‌చ్చేస్తారు. అప్పుడు కానీ అధికారికంగా వాయిదా అన్న విషయాన్ని ప్ర‌క‌టించ‌లేరు. ఏదేమైనా పుకార్లు ఎన్నో షికార్ చేస్తుంటాయి. అధికారికంగా చెప్పేది మాత్ర‌మే న‌మ్మ‌కం.