Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' కొత్త రిలీజ్ డేట్ అదేనా..?

By:  Tupaki Desk   |   17 Jun 2021 12:00 PM IST
ఆర్.ఆర్.ఆర్ కొత్త రిలీజ్ డేట్ అదేనా..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వస్తోంది.

ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ ని మార్చిన మేకర్స్.. చివరగా దసరా కానుకగా 2021 అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈసారి కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో అనుకున్న సమయానికి ట్రిపుల్ ఆర్ రావడం అసాధ్యమనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామ రాజు - కొమరం భీమ్ పాత్రలతో రూపొందుతున్న సినిమా కాబట్టి, గణతంత్ర దినోత్సవం సరైన తేదీ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరి తారక్ - చరణ్ లపై షూట్ చేయాల్సిన ఫ్రెండ్ షిప్ సాంగ్.. మరొకటి చరణ్ - ఆలియా భట్ లపై చిత్రీకరించాల్సి రొమాంటిక్ సాంగ్. జూన్ చివరి వారంలో తిరిగి షూటింగ్ ప్రారంభించి.. వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ ఫినిష్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'RRR' మూవీకి సంబంధించిన పది భాషల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.