Begin typing your search above and press return to search.

జక్కన్న కన్ను ఇప్పుడు పెద్ద పండగ మీద పడిందా..?

By:  Tupaki Desk   |   27 Aug 2021 11:30 PM GMT
జక్కన్న కన్ను ఇప్పుడు పెద్ద పండగ మీద పడిందా..?
X
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ''ఆర్‌ ఆర్‌ ఆర్‌''. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ఇందులో కలిసి నటిస్తున్నారు. కొన్ని చిన్న చిన్న షాట్స్‌ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీలని మార్చుకున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని 2021 అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్లుగానే ప్రతి పోస్టర్‌ లోనూ అదే తేదీని వేస్తూ సినీ అభిమానుల్లో ఆశ కల్పించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేయరని అర్థం అయింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ మార్కెట్ పుంజుకుంటున్నా.. ఇతర భాషల్లో సిచ్యుయేషన్ వేరేలా ఉంది. ఇటీవల విడుదలైన 'బెల్ బాటమ్' వంటి చిత్రాలు హిట్ టాక్ తెచ్చికొని కూడా.. వసూళ్ళు రాబట్టలేకపోయింది.

అందుకే మొత్తం భారతీయ థియేట్రికల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉండటంతో తదుపరి మంచి సీజన్ కోసం ట్రిపుల్ ఆర్ మేకర్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని జక్కన్న అండ్ టీమ్ ఆలోచన చేస్తోందట. అక్టోబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అయితే దీనిపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట.

కాకపోతే 2022 సంక్రాంతి సీజన్ కోసం ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు కర్చీఫ్స్ వేసి కూర్చున్నాయి. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' - మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాలు వచ్చే పెద్ద పండక్కి రానున్నాయి. అయితే ఇప్పుడు ఫెస్టివల్ బెర్త్ కోసం 'ఆర్ ఆర్ ఆర్' కూడా ప్రయత్నాలు మొదలు పెడుతోందని టాక్ నడుస్తోంది. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో మిగతా సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ని రీ షెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే 'RRR' సంక్రాంతి కి రావాలని చూస్తే మిగతా సినిమాల నిర్మాతలు గిల్డ్ దగ్గర పంచాయతీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేయకపోతే మాత్రం, 2022 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఉగాది - శ్రీరామనవమి పండుగ సమయాల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల ఆధారంగా ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం తెరకెక్కుతోంది.

రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇందులో ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాసారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.