Begin typing your search above and press return to search.

రౌడీస్టార్ 'లైగర్‌' వీసా కష్టాలు

By:  Tupaki Desk   |   9 Oct 2021 9:31 AM GMT
రౌడీస్టార్ లైగర్‌ వీసా కష్టాలు
X
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఇంట్రెస్ట్‌ ను కలిగిస్తోంది. రియల్‌ హీరో మైక్ టైసన్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్న కారణంగా సినిమాపై ఆసక్తి అంచనాలు అందరిలో కనిపిస్తున్నాయి. ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ ను అతి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైక్ టైసన్‌ తో సన్నివేశాల చిత్రీకరణ కోసం యూఎస్‌ వెళ్లబోతున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు యూఎస్ వెళ్లేందుకు ప్రస్తుతం వీసా పక్రియ జరుగుతోంది. కొందరికి వీసాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గతంలో షూటింగ్ లకు యూఎస్ వీసాలు సింపుల్‌ గా ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం కరోనా కారణంగా వీసాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు.

లైగర్ సినిమా యూనిట్‌ సభ్యులు ముందస్తుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే యూఎస్‌ షెడ్యూల్‌ ముగించాల్సి ఉంది. కాని వీసాలు ఆలస్యం అవ్వడం వల్ల చిత్రీకరణ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఒకటి రెండు వారాల్లో చిత్రీకరణ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇస్తారనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు అంతా ఉన్నారు. రికార్డు స్థాయిలో ఈ సినిమాకు పూరి ఖర్చు చేస్తున్నాడు. లైగర్‌ సినిమాను ఒక భారీ మాస్ యాక్షన్‌ డ్రామాగా రూపొందించే క్రమంలో విజయ్‌ దేవరకొండను చాలా రఫ్‌ లుక్ లో పూరి చూపిస్తున్నాడు. ఆయన లుక్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండుకు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.

విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనన్య పాండే నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో పలువురు సీనియర్‌ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. ఇస్మార్ట్‌ శంకర్ తర్వాత పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ పడలేదు. కనుక లైగర్‌ సినిమా ఖచ్చితంగా ఆయనకు ఒక బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుని బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో కూడా గుర్తింపును దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.