Begin typing your search above and press return to search.

'రౌడీ బోయ్స్' ఎంతమాత్రం తగ్గడం లేదుగా!

By:  Tupaki Desk   |   9 Jan 2022 3:47 AM GMT
రౌడీ బోయ్స్ ఎంతమాత్రం తగ్గడం లేదుగా!
X
సాధారణంగా కొత్త హీరోలు ఎవరైనా ఎంట్రీ ఇస్తున్నారంటే, మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించేయాలనే ఆరాటంతో ఉంటారు. అందుకోసం అన్నిరకాల ఆయుధాలను ఉపయోగించేస్తూ ఉంటారు. ఈ కుర్రాడి దగ్గర మంచి కంటెంట్ ఉంది .. ఏమైనా చేయగలడు అనుకునేలా చేయాలంటే, వాళ్ల ముందున్న ముఖ్యమైన మార్గం రీమిక్సులు. స్టార్ హీరోల హిట్ సాంగ్స్ తీసుకునికి వాటినన్నింటిని ఒకే పాటలో కలుపుతూ, ఆ హీరోలను అనుకరిస్తూ చెలరేగిపోతుంటారు. ఈ విధంగా చేయడం వలన ఆయా హీరోల అభిమానుల నుంచి ఎక్కువ మార్కులు పడిపోతాయనేది ఒక ఆలోచన.

కొత్త హీరో ఆశిష్ రెడ్డి కూడా అలాంటి ఒక ప్రయత్నమే చేసినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు సోదరుడి తనయుడైన ఆశిష్ రెడ్డి .. 'రౌడీ బాయ్స్' సినిమా ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమవుతున్నాడు. ఇంతవరకూ 50 సినిమాలను నిర్మించిన అనుభవంతో, తమ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆశిష్ రెడ్డిని హీరోగా నిలబెట్టాలనే ఉద్దేశంతో దిల్ రాజు ఉన్నాడు. అందుకోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ముందుగా ఆశిష్ రెడ్డిని విజయ్ దేవరకొండ తరహాలో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చూస్తున్నాడు.

ఈ విషయంలో ఆయన టైటిల్ దగ్గర నుంచి జాగ్రత్త పడ్డాడు. ఇక యూత్ లో మెగా అభిమానులు .. నందమూరి ఫ్యాన్స్ .. దగ్గుబాటి .. అక్కినేని అభిమానులు ఉంటారు. అందువలన చిరంజీవి 'శంకర్ దాదా' .. నాగార్జున 'మన్మథుడు' వెంకటేశ్ 'చంటి' సినిమాల నుంచి హిట్ సాంగ్స్ తీసుకుని రీమిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక బాలకృష్ణ ఏ సినిమా నుంచి ఏ హిట్ సాంగ్ తీసుకున్నారనేది తెలియవలసి ఉంది. ఒక్కో పాట నుంచి ఒకటిన్నర నిమిషం నిడివిని తీసుకున్నారని అంటున్నారు. సినిమాకి ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా చూస్తున్నారట.

ఇక ఏ కథ అయినా యూత్ కి కనెక్ట్ కావాలంటే ఆ కథ కాలేజ్ క్యాంపస్ లో నడవాలి. అక్కడే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టాలి. కాలేజ్ లో జరిగే గొడవల్లో హీరోయిజం బయటపడాలి. ఇలా ఎవరైనా సరే కొన్ని బేసిక్ లైన్స్ ను ఫాలో కావలసిందే. అలా ఆశిష్ హీరోయిజానికి పడిపోయే అమ్మాయిలా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీని వర్కౌట్ చేసినట్టుగా అనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. తొలి సినిమాతో ఆశిష్ రెడ్డి ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.