Begin typing your search above and press return to search.

అలనాటి రొమాంటిక్ హీరో .. హరనాథ్

By:  Tupaki Desk   |   2 Sept 2021 4:00 PM IST
అలనాటి రొమాంటిక్ హీరో .. హరనాథ్
X
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి కథానాయకులలో హరనాథ్ ఒకరు. అప్పట్లో హీరోలు అంటే ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. అంతే. పౌరాణిక చిత్రాల రారాజుగా ఎన్టీఆర్ నీరాజనాలు అందుకుంటూ ఉంటే, రొమాంటిక్ హీరోగా ఏఎన్నార్ దూసుకుపోతున్నారు. వారు ఎంచుకున్న మార్గంలో అడుగుపెట్టే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి. వారి దరిదాపుల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా ఎవరూ చేయని రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనే హరనాథ్ ఎంట్రీ ఇచ్చారు.

హరనాథ్ పూర్తి పేరు .. బుద్ధరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పరిధిలోని 'రాపర్తి' గ్రామంలో ఆయన జన్మించారు. హరనాథ్ మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. కాలేజ్ రోజుల్లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న స్టూడెంట్ లీడర్ గా ఆయన దూకుడు చూపించేవారు. అదే సమయంలో ఆయన నాటకాల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. స్నేహితులతో కలిసి సరదాగా నాటకాలు వేస్తూ ఉండేవారు.

మంచి ఒడ్డూ పొడుగు .. ఆకర్షణీయమైన రూపంతో అందగాడు అనిపించుకున్న హరనాథ్ కి, కాలేజ్ రోజుల్లోనే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. "అచ్చం హీరోలా ఉన్నావ్ రా .. సినిమాల్లో ట్రై చేయకూడదూ .. " అంటూ స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో ఆ దిశగా ఆయన అడుగులు వేశారు. అలా ఆయన 'మా ఇంటి మహాలక్ష్మి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు, హైదరాబాద్ లో షూటింగు జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది.

ఇక ఈ సినిమా తరువాత నటుడిగా హరనాథ్ వెనుదిరిగి చూసుకోలేదు. కుర్రాడు చాలా నాజూకుగా ఉన్నాడు .. మంచి అందగాడు అని అంతా చెప్పుకున్నారు. ముఖ్యంగా ఆయన వాకింగ్ స్టైల్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు వేస్తూనే, హీరోగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ' లేత మనసులు' .. ' చిట్టిచెల్లెలు' .. ' అమరశిల్పి జక్కన్న' వంటి సినిమాలు ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. 'గుండమ్మ కథ' సినిమాలో గుండమ్మ అల్లుళ్లుగా ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు కనిపిస్తే, ఆమె కొడుకు పాత్రలో హరనాథ్ కనిపించడం విశేషం.

చాలా తక్కువ కాలంలోనే హరనాథ్ స్టార్ డమ్ ను అందుకున్నారు. పౌరాణికాల్లో ఎన్టీఆర్ తరువాత ఆ తరహా పాత్రల్లో హరనాథ్ మెప్పించారు. రొమాంటిక్ హీరోగా అక్కినేని తరువాత స్థానం తనదే అనిపించుకున్నారు. పౌరాణికాల్లో తాను ప్రధానమైన పాత్రలను చేస్తున్నప్పుడు, విష్ణుమూర్తి .. శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు వంటి పాత్రలకు హరనాథ్ ను తీసుకోవాలని ఎన్టీఆర్ సిఫార్స్ చేయడం విశేషం. దీనిని బట్టి హరనాథ్ రూపం ఎంత ఆకర్షణీయంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక చారిత్రక చిత్రాలలోను ఆయనను ఎన్టీఆర్ ప్రోత్సహించారు.

అలా చాలా వేగంగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న హరనాథ్, వారి అడుగుజాడలలో నడవలేకపోయారు. ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చిపడటంతో, ఆయన మద్యానికి బానిస అయ్యారు. ఆ మత్తులో నుంచి బయటపడలేకపోయారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా చివరిరోజుల్లో అతిథి పాత్రల్లో కనిపించడానికి కూడా ఆయన అంగీకరించారు. 100 పైగా సినిమాల్లో నటించిన ఆయన, అనారోగ్య కారణాల వలన అభిమానులను వదిలేసి వెళ్లిపోయారు. ఏదేమైనా తెలుగు తెరపై .. తెలుగు ప్రేక్షకుల హృదయాలపై రొమాంటిక్ హీరోగా ఆయన వేసిన ముద్ర మాసిపోనిది .. మరిచిపోలేనిది అనే చెప్పాలి. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఓసారి ఆయనను స్మరించుకుందాం.