Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మారుతి అన్నీ కలిపి కొట్టాడు

By:  Tupaki Desk   |   19 Jun 2016 4:49 AM GMT
ట్రైలర్ టాక్: మారుతి అన్నీ కలిపి కొట్టాడు
X
కొంతకాలంగా ప్రొడక్షన్ జోలికి వెళ్లకుండా.. వేరే సినిమాలు వేటికీ స్క్రిప్టులివ్వకుండా తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల మీదే దృష్టిపెడుతున్న మారుతి.. కొంత గ్యాప్ తర్వాత కథ-స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. అగ్ర నిర్మాత దిల్ రాజుతో కలిసి మారుతి ఈ సినిమాను నిర్మించడం విశేషం. నిన్న ఆడియో విడుదల చేసి.. ట్రైలర్ కూడా వదిలింది ‘రోజులు మారాయి’ టీమ్. ఆ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

అమాయకమైన ఇద్దరబ్బాయిలు.. వాళ్లను బకరాల్ని చేసి ఆడుకునే ఇద్దరమ్మాయిలు.. వీళ్ల మధ్య నడిచే స్టోరీనే ‘రోజులు మారాయి’. ఇంతకుముందు మారుతి నుంచి వచ్చిన న్యూ ఏజ్ ప్రేమకథలన్నింట్లోనూ ఈ కాలం అమ్మాయిలు బాగా పాడైపోయారని.. అబ్బాయిల్ని వాడుకుని వదిలేస్తున్నారనే చూపించారు. ఇందులో ఆ డోస్ మరింత ఎక్కువైనట్లుంది. ‘‘దానికి నేను కష్టపడి నా ఆఫీస్‌ లో ఉద్యోగం వేయిస్తే.. అది ఈజీగా ఎదుటి ఆఫీసోడిక లైనేస్తోంది ఫాదర్’’ అనే పార్వతీశం డైలాగ్ ను బట్టి హీరోయిన్ క్యారెక్టర్ని ఎలా చూపించారో అర్థమైపోతుంది.

ట్రైలర్ తొలి సగం సరదాగా ఉంటే.. రెండో సగంలో క్రైమ్ ఎలిమెంట్ చూపించారు. ‘మీరు త్వరలోనే విధవరాళ్లు కాబోతున్నారు’’ అని ఓ బాబా చెప్పిన మాట నమ్మి.. తమకు కాబోయే భర్తలు ఎలాగూ చనిపోతారు కాబట్టి ఇద్దరు బకరా గాళ్లను చూసి పెళ్లి చేసుకుందామని ఫిక్సయిపోయి హీరోల్ని పెళ్లి చేసుకుంటారన్నమాట హీరోయిన్లు. తర్వాత వాళ్లే ఆ హీరోల్ని కూడా చంపేస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ. ట్రైలర్ ను బట్టి అర్థమవుతున్నదిదీ. కొంచెం బాలయ్య సినిమా ‘మిత్రుడు’ లైన్ కూడా కనిపిస్తోంది. చేతన్..పార్వతీశం.. తేజస్వి..కృతిక జయకుమార్ ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.