Begin typing your search above and press return to search.

'రోర్ ఆఫ్ RRR' క్రెడిట్ మొత్తం వాళ్ళదే: రాజమౌళి

By:  Tupaki Desk   |   16 July 2021 9:46 AM GMT
రోర్ ఆఫ్ RRR క్రెడిట్ మొత్తం వాళ్ళదే: రాజమౌళి
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. 'రోర్ ఆఫ్ RRR' పేరుతో నిన్న శుక్రవారం విడుదలైన ఈ వీడియో ఇప్పటికే 6.5 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్.. అందరూ ఈ గ్లిమ్స్ గురించే డిస్కషన్ చేస్తున్నారు. 108 సెకన్ల పాటు ఉన్న 'ఆర్ ఆర్ ఆర్ గర్జన' మేకింగ్ వీడియోలో నటీనటులు - సాంకేతిక నిపుణులు - ఇతర సిబ్బంది.. ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఇందులో భారీ సెట్స్ - యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ చూపిస్తూ.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలైట్ చేశారు. 'ఆర్ ఆర్ ఆర్ గర్జన' వీడియోతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు.. తన సినిమాని మార్కెట్ చేసుకోవడంలో ఎక్సపర్ట్ అని మరోసారి నిరూపించారు.

ఈ మేకింగ్ వీడియోకు విశేష స్పందన రావడం పట్ల దర్శకధీరుడు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇది తనకు ట్రైలర్ లాంచ్ లాగా అనిపిస్తుందని అన్నారు. రాజమౌళి ట్విట్టర్ వేదికగా 'రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్' కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంపై స్పందించారు. "#RRR మూవీ మేకింగ్ వీడియోకు అద్భుతమైన రిసెప్షన్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ఆల్మోస్ట్ ట్రైలర్‌ ను విడుదల చేసినట్లుగా అనిపించింది. చాలా ప్రశంసలు నాకు దక్కుతున్నాయి. కాని వాస్తవానికి నేను షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాను. కార్తికేయ - వంశీ అట్లూరి - ప్రదీప్ మరియు వాల్స్ అండ్ ట్రెండ్స్ కంపెనీ యొక్క రెండు నెలల కృషి వల్ల ఇది జరిగింది. అందుకే ఈ ప్రశంసలు వారికి చెందినవి. ఆకర్షణీయమైన సంగీతం అందించిన అచ్చు రమణి - ర్యాప్ పాడి లిరిక్స్ రాసిన బ్లాజే కు ధన్యవాదాలు. మేకింగ్ ఫుటేజీని తీసుకొని అన్ని వినూత్నమైన యాంగిల్ లో జి.శ్రీనివాస్ కు కృతజ్ఞతలు" అని రాజమౌలి ట్వీట్ చేశారు.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అని ఫిక్షనల్ కథాంశంతో ఈ పీరియాడికల్ మూవీ రూపొందుతోంది. రాజమౌళి చిత్రాలకు కథలు అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్టోరీ రాశారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ - ఐరిస్ భామ ఒలివియా మోరిస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ - సీనియర్ హీరోయిన్ శ్రియా - నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సముద్రఖని లతో పాటుగా రే స్టీవెన్‌ సన్‌ - అలిసన్‌ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. 'ఆర్‌ ఆర్‌ ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.